రోడ్డు ప్రమాదంలో యువ క్రికెటర్‌ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువ క్రికెటర్‌ దుర్మరణం

ఆఫ్గనిస్తాన్‌ యువ క్రికెటర్‌, టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ నజీబ్‌ తరకాయ్‌(29) దుర్మరణం చెందాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. వారం రోజుల కిందట తూర్పు నంగన్‌హర్‌లో రోడ్డు దాటుతున్న క్రమంలో ఓ కారు నజీబ్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలు కాగా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

కాగా నజీబ్‌ మరణవార్తను అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ధ్రువీకరించింది. యువ క్రికెటర్‌ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బోర్టు.. దేశమంతా విషాదంలో మునిగిపోయిందని ట్వీట్‌ చేసింది. నజీబ్‌ మరణం తమకు తీరని లోటు అని, దూకుడుగా ఇన్నింగ్‌ ఆరంభించే ఓపెనర్‌, మంచి మనిషిని కోల్పోయామని విచారం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదంలో అతడు దుర్మరణం పాలయ్యాడని, నజీబ్‌ లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ సంతాపం తెలిపింది.