రోడ్డు ప్రమాదంలో నటుడు దుర్మరణం

Actor nannam sunil Passed Away

సినీ పరిశ్రమ మరో వర్ధమాన నటుడిని కోల్పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు నన్నం సునీల్ మరణించాడు. ప్రస్తుతం ఆయన వయసు 24 సంవత్సరాలు.పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండల పరిధిలోని రాచర్ల పాడు వద్ద నేషనల్ హైవేపై అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పడుగుపాడు గ్రామానికి చెందిన షకీల్, హైదరాబాద్ లో సినీ సంగీత దర్శకుడిగా ఉండగా, బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లికి చెందిన సునీల్‌ కొన్నేళ్లుగా ఆయన వద్ద శిక్షణ పొందుతూ టీవీ సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నాడు. షకీల్ తమ్ముడు సలావుద్దీన్ ఓ ఇంటర్వ్యూ నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లగా, అదే కారులో స్వగ్రామానికి వెళ్లేందుకు సునీల్ కూడా బయలుదేరాడు. రాచర్లపాడు వద్ద గుర్తు తెలియని వాహనం వీరి కారును ఢీకొనగా, సునీల్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో సలావుద్దీన్ కోమాలోకి వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.