లక్ష్యం దిశగా ఆదిత్య-ఎల్‌1.. విజయవంతమైన నాలుగో భూకక్ష్య పెంపు…

Aditya-L1 towards goal.. Fourth successful orbital boost...
Aditya-L1 towards goal.. Fourth successful orbital boost...

సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆదిత్య -ఎల్1.. లక్ష్యం దిశగా సాగుతోంది. సూర్యుడి రహస్యాలను చేధించేందుకు రోజురోజుకు కాస్త దగ్గరవుతోంది. అయితే తాజాగా ఉపగ్రహానికి నాలుగోసారి ఆదిత్య ఎల్‌-1 భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టింది. ఈ ఆపరేషన్‌ను బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ ద్వారా విజయవంతంగా నిర్వహించింది.

మారిషస్‌, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో(ISRO) గ్రౌండ్‌ స్టేషన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి. ఈ విన్యాసంతో 256 km x 121973 km కక్ష్యలోకి ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం ప్రవేశించిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 19న తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆదిత్య ఎల్‌-1కు 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్‌-1 పాయింట్‌ను చేరుకోవాలంటే నాలుగు నెలలు పడుతుందని వివరించారు.

ఆదిత్య ఎల్‌-1లో 1480.7 కిలోల బరువున్న 7 పరిశోధన పరికరాలు సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయని.. సూర్యుడిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే ‘పాలపుంత’తో పాటు ఇతర గెలాక్సీల్లోని తారల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.