Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావతి వివాదం నేపథ్యంలో చరిత్రకు కీలక ఆధారంగా ఉన్న పురాతన శిలాఫలకాన్ని ఆర్కియాలజీ విభాగం అధికారులు మూసివేశారు. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్ రాణి పద్మిణిని చూశాడని రాసి ఉండడమే శిలాఫలకం మూసివేయడానికి కారణం. పద్మావతి వివాదం సందర్భంగా చరిత్రకు ఒక్కొక్కరు ఒక్కో భాష్యం చెబుతున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి అల్లావుద్దీన్ ఖిల్జీ, చిత్తోర్ రాణి పద్మిని మధ్య ఏం జరిగిందన్నది అప్పటితరానికి చెందిన వారికి తప్ప ఎవరికీ తెలియదు. కానీ… అపురూపమైన అందచందాలు, అపారమైన తెలివితేటలతో పద్మిణి… రాజ్ పుత్ మహిళల చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. పద్మిణి మీద వ్యామోహం తోనే ఖిల్జీ చిత్తోర్ కోటపై దండయాత్ర చేశాడని, యుద్ధంలో భర్త రాజా రావల్ సింగ్ ఓడిపోవడంతో శత్రువు చేతికి చిక్కలేక ఇతర అంతఃపుర స్త్రీలతో కలిసి పద్మిణి ఆత్మాహుతి చేసుకుందన్నది అందరూ ఎక్కువగా నమ్ముతున్న కథ. దీనితో పాటు… ఇంకా అనేక కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ చరిత్రకారులు సహా ప్రజలు ఎక్కువమంది నమ్మేదీ ఈ కథనే.
అయితే అసలు పద్మిణి అన్న స్త్రీనే రాజ్ పుత్ ల చరిత్రలో లేదని, పద్మిణి కొందరు కవుల ఊహాసుందరి మాత్రమే అని మరికొందరు వాదిస్తుంటారు. ఈ విషయాన్ని పక్కనపెడితే అందరూ అంగీకరించేది మాత్రంరాణి పద్మిణి ని మొహాన్ని అద్దంలో ఖిల్జీ చూశాడని. ఆర్కియాలిజీ విభాగం అధికారులు మూసివేసిన శిలాఫలకం మీద కూడా రాసి ఉంది ఇదే. పద్మావతిలో కూడా సంజయ్ లీలా భన్సాలీ ఈ సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. పద్మావతి, ఖిల్జీ మధ్య అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని… జీవితంలో ఒక్కసారి కూడా కలుసుకోని వారి మధ్య అలాంటి సన్నివేశాలు ఉన్నట్టు ఎలా చిత్రీకరిస్తారని రాజ్ పుత్ కర్ణిసేన మండిపడుతోంది. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తున్న భన్సాలీ చరిత్ర ప్రకారమే సినిమా ఉందని, అద్దంలో ప్రతిబింబం చూసే సీన్ తప్ప… ఖిల్జీ, పద్మావతి మధ్యా ఎలాంటి సన్నివేశాలూ లేవని వివరణ ఇస్తున్నారు.
భన్సాలీ చెప్పినట్టు చరిత్ర ప్రకారమే చూసుకున్నా… ఆ రోజుల్లో పరాయి పురుషుడు కన్నెత్తి చూడలేని మహారాణిని వేరే రాజ్యపు సుల్తాన్ అద్దంలో చూసే అవకాశం ఎలా వస్తుందన్నది అందరికీ వచ్చే సందేహం. చూపిస్తే మహారాజే స్వయంగా చూపించాలి… లేదంటే ఎవరన్నా మోసపూరితంగా ఇలా వ్యవహరించాలి. అయితే చరిత్ర ప్రకారం పద్మిణి భర్త మహారాజా రావల్ రత్ సింగే తన భార్య మోమును పరాయిపురుషుడికి అద్దంలో చూపించాడని తెలుస్తోంది. నిజానికి పద్మిణి సౌందర్యకథలు విని ఆమెను ఎలాగైనా వశపర్చుకోవాలన్న దుర్భుద్ధితో ఖిల్జీ 1302లో చిత్తోర్ కోటను ముట్టడించాడు. అయితే కోటను ఆధీనంలోకి తెచ్చుకోవడం ఖిల్జీ వల్ల కాలేదు. దీంతో మోసానికి పాల్పడ్డాడు. పద్మినీదేవి తనకు సోదరిలాంటిదని, ఒక్కసారి ఆమె ముఖాన్ని చూడనిస్తే చాలు ఆనందంతో వెళ్లిపోతానని రావల్ రతన్ సింగ్ వద్ద ప్రాధేయపడినట్టుగా మాట్లాడాడు. ఖిల్జీ దురాలోచన గమనించని మహారాజు నేరుగా చూపించడం కుదరదని, కావాలంటే అద్దంలో చూపిస్తానని ప్రతిపాదించాడు. దీనికి ఖిల్జీ ఒప్పుకున్నాడు. సపరివారంగా తరలివచ్చి… పద్మిణి ముఖాన్ని అద్దంలో చూశాడు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఖిల్జీని మర్యాదగా సాగనంపడానికి మహారాజు విడిదిదాకా వెంటవెళ్లాడు. అదను చూసుకుని ఖిల్జీ మహారాజును బంధించాడు. పద్మిణిని తనకు అప్పగిస్తేనే మహారాజును విడిచిపెడతానని షరతు విధించాడు.
దీంతో ఖంగుతున్న రాజపుత్రులు ఎత్తుకు పైఎత్తు వేశారు. పద్మిణిని పంపినట్టే పంపి, సైనికులకు అంతఃపుర కాంతల వేషాలు వేసి ఆమె వెంట మేనాల్లో ఎక్కించారు. వారంతా ఎలాగోలా కష్టపడి పద్మిణిని మహారాజు రతన్ సింగ్ వద్దకు చేర్చారు. అంతటితో ఆగకుండా రాజపుత్ర వీరులు రక్షణ గోడలా నిలిచి మహారాజు,రాణిని అక్కడినుంచి తప్పించి..తాము బలైపోయారు. అయితే రతన్ సింగ్, పద్మిణి తప్పించుకున్న సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. తర్వాతి ఏడాది చిత్తోర్ పై మళ్లీ దండెత్తిన ఖిల్జీ ఈ సారి కోటను దిగ్బంధం చేసి ఎట్టకేలకు విజయం సాధించాడు. మహారాజు సహా 30వేలమంది రాజపుత్రులు ఆ యుద్ధంలో మరణించారు. మహారాజా ఓటమిని తెలుసుకున్న రాణి పద్మిణి ఖిల్జీకి చిక్కకుండా ఉండేదుకు అగ్నిప్రవేశం చేశారు. ఆమెతో పాటు వెయ్యి మంది రాజపుత్ర స్త్రీలు ఇలా అగ్నికి ఆహుతయ్యారు. పద్మిణి, ఖిల్జీ గురించి ఎక్కువమంది చరిత్రకారులు ఒప్పుకున్నకథ ఇది.