వైద్య సిబ్బందిపై దాడి

వైద్య సిబ్బందిపై దాడి

గాయపడిన ఓ మహిళకు సకాలంలో వైద్యం అందించలేదని, అందువల్లనే చనిపోయిందని ఆమె బంధువులు పలాసలో వైద్య సిబ్బందిపై ఆదివారం దాడికి పాల్పడ్డారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ న్యూకాలనీకి చెందిన శకలాభక్తుల శాంతికుమారి (52) ఆదివారం తన ఇంటిలో బాత్‌రూమ్‌లో జారిపడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే ఆ సమయానికి ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు, ఇతర సిబ్బంది కరోనా పరీక్షలు చేయించాలంటూ వైద్యం జాప్యం చేశారు.

వైద్యులు ఎంతకూ రాకపోవడంతో క్షతగాత్రురాలు చికిత్స లేకుండా అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు ఆమె మృతి చెందడంతోకుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎంఎల్‌టీ సిబ్బంది నారాయణపై దాడికి దిగారు. అనంతరం మృతదేహం నుంచి శాంపిల్‌ సేకరించారు. ఫలితం వచ్చే వరకు వేచి చూడకుండా కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు చేపట్టారు. అయితే ఆమెకు ట్రూనాట్‌ పరీక్షలో కరోనాగా నిర్ధారించారు. దీంతో కాంటాక్టులను ట్రేస్‌ చేసే పనిలో అధికారులు పడ్డారు. ఇది లా ఉండగా ఉద్యోగి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయగా కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.