బన్నీసుక్కు సినిమాలో ఓ రేంజిలో ఉన్న విజువల్స్

బన్నీసుక్కు సినిమాలో ఓ రేంజిలో ఉన్న విజువల్స్

ఈ ఏడాది మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీస్‌ లిస్టు తీస్తే.. అందులో అల్లు అర్జున్-సుకుమార్‌ కలయికలో తెరకెక్కబోయే చిత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య-2’ ఎంత ప్రత్యేకమైన సినిమాలో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ దశాబ్దానికి పైగా విరామం తర్వాత కలిసి సినిమా చేస్తుండటం.. పైగా ‘రంగస్థలం’ లాంటి మెగా హిట్ తర్వాత సుక్కు డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి.

సుకుమార్ చాలా టైం తీసుకుని, ఎంతో కసరత్తు చేసి ఈ సినిమా స్క్రిప్టు తీర్చిదిద్దాడు. దీని షూటింగ్ మొదలు కావడంలోనూ ఆలస్యం జరిగింది. ఐతే అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈలోపు సుక్కు అండ్ టీం బన్నీ లేకుండానే కేరళకు వెళ్లి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించుకుని వచ్చిన సంగతి తెలిసిందే.

శనివారం సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా తొలి షెడ్యూల్‌కు సంబంధించిన ఆన్ లొకేషన్ విజువల్స్‌తో ఒక వీడియోను వదిలింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. కేరళలో జలపాతాలు, పచ్చదనం పరుచుకుని ఉన్న ఆహ్లదకరమైన ప్రాంతంలో ఈ షెడ్యూల్ చేసుకుని వచ్చాడు సుక్కు. నటీనటులెవ్వరినీ ఇందులో చూపించలేదు కానీ.. లొకేషన్లు మాత్రం అదిరిపోయాయి ఈ వీడియోలో.

సుకుమార్ మీదే ఫోకస్ పెట్టిన ఈ వీడియాలో ఒక చోట ఆయన కళ్లు తిప్పుతూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అదిరిపోయింది. ఎప్పుడూ సుక్కు పక్కన ఛాయాగ్రాహకుడిగా రత్నవేలు కనిపిస్తాడు. ఐతే ఆయన ‘ఇండియన్-2’కు కమిటై ఉండటంతో ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగు తెరకు పరిచయం అయిన స్కూబా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలందుకున్నాడు. అతను కూడా విజువల్స్‌లో కనిపించాడు. ఈ మేకింగ్ వీడియో చూస్తే మాత్రం బన్నీ-సుక్కు సినిమాలో విజువల్స్ మాత్రం ఓ రేంజిలో ఉంటాయన్నది స్పష్టం.