చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని పవన్…నవ్వుతూ కెమెరా కంటికి !

ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మనవరాలు వివాహం ఈరోజు హైదరాబాద్ లో జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఫిలింసిటీలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ముఖాముఖి ఎదురుపడ్డారు. చిరునవ్వుతో పలకరించుకున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన వీరు ఒకరికి ఒకరు తారసపడ్డారు. వధూవరులను ఆశీర్వదించి, తిరుమల శ్రీవారి ప్రసాదాలను బహుమతిగా అందించిన చంద్రబాబు, వేదిక దిగిరాగానే పవన్ కల్యాణ్ ఎదురు పడ్డారు. నమస్కార, ప్రతినమస్కారాలు చేసుకుంటూ కొంచెం సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. గత ఎన్నికల్లో పవన్ తెలుగుదేశానికి మద్దతు ఇవ్వగా ఈసారి ఆయన జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమలో ఈ కలయిక ఆసక్తికరంగా మారింది.