రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇందిరా గాంధీ , ఎన్టీఆర్ ప్రజాదరణ కి నిలువుటద్దాలు. అలాంటి వాళ్ళకే ఎదురుదెబ్బలు తప్పలేదు. ఇక చంద్రబాబు ఎంత?. చంద్రబాబుకి కూడా ఓటమి కొత్తకాదు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో రెండు సార్లు ఓటమి ఆయన్ను చుట్టుముట్టింది. అయితే అప్పట్లో చంద్రబాబు ఓటమికి కారణాలు స్పష్టంగా కనిపించాయి. 2004 ఎన్నికల సమయంలో కొత్తగా వచ్చిన ఆర్ధిక సంస్కరణలు , అనావృష్టి ప్రభావం , తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ప్రభావం ఎన్నికల మీద గట్టి ప్రభావం చూపించాయి. చంద్రబాబుకి ఓటమి రుచి చూపించాయి. ఇక 2009 లో తెరాస తో పొత్తు , ప్రజారాజ్యం ఓట్లు చీల్చుకోవడంతో చంద్రబాబు ఓటమి ఎదుర్కొన్నారు. ఆ రెండు సందర్భాలతో పోల్చుకుంటే 2014 భిన్నం. ఈసారి మారిన బాబు సంక్షేమ పధకాల మీద బాగా దృష్టి పెట్టారు. అయినా ఓటమి తప్పలేదు ఎందుకు ? ఆంధ్రప్రదేశ్ లో సామాజిక వర్గ సమీకరణాలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిసినా చంద్రబాబు పరిపాలన ఆ దృక్కోణంలో సాగలేదు. 2014 ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అభివృద్ధికి మాత్రమే పట్టం కడతారని భావించారు. అందుకే సామాజిక సమీకరణాల్లో కూడా అభివృద్ధిని అస్త్రంగా మలుచుకోడానికి చూసారు. కాపు కార్పొరేషన్ , బ్రాహ్మణ కార్పొరేషన్ లాంటివి అందులో భాగమే. రాజకీయ కోణంలో ఈ రెండు వర్గాలు టీడీపీ కి పూర్తిగా దన్నుగా నిలిచే వర్గాలు ఏమీ కాదు. బీసీ లు ఆది నుంచి టీడీపీ కి అండగా వుంటూ వస్తున్నాయి. కానీ కాపు రిజర్వేషన్ అంశంలో చంద్రబాబు చొరవతో బీసీల్లో ఆగ్రహం కలిగింది. దీంతో ఎన్నడూ లేని స్థాయిలో ఈసారి బీసీలు వైసీపీ కి అండగా నిలిచారు. ఇక కాపు , బ్రాహ్మణ వర్గాలు అభివృద్ధి కోణంలో కాకుండా రాజకీయ కోణంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా నిలిచారు. అలాగే రెడ్ల విషయంలోనూ జరిగింది. రాయలసీమలో జగన్ కి అండగా నిలుస్తూన్న రెడ్డి వర్గాన్ని ఆకట్టుకునే క్రమంలో పార్టీకి అండగా వుంటూ వచ్చిన బలిజలు ఇతర వర్గాల్ని బాబు నిర్లక్ష్యం చేశారు. మొత్తానికి సామాజిక సమీకరణాల విషయానికి వచ్చేసరికి పార్టీకి మొదట నుంచి అండగా వుంటూ వస్తున్న వర్గాల్ని పెద్దగా పట్టించుకోకుండా వీరితో బలం పెరుగుతుందని భావించిన వర్గాల కోసం చంద్రబాబు ఆరాటపడ్డారు. అవకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసిన చందంగా ఆయన రెంటికీ చెడ్డ రేవడి అయ్యారు.