చెడ్డీ గ్యాంగ్ దొరికింది !

Cheddy gang arreted by telangana police in gujarath
Cheddy gang arreted by telangana police in gujarath

ఆ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు అర్ధరాత్రి దొంగతనాలు చేయడం అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై దాడులు చేస్తూ హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతూ నగరవాసులను, అలాగే పలు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ ముఠాలోని కొందరిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్‌లో మకాం వేసిన నలుగురు చెడ్డీ గ్యాంగ్ దొంగలను అరెస్ట్ చేశారు. ఇటీవల సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలోని మియాపూర్, నిజాంపేట్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ క్రమంలో దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న రాచకొండ పోలీసులకు ఒక కీలక సమాచారం అందడంతో మూడువారాల క్రితం ప్రత్యేక పోలీసు బృందం గుజరాత్‌కు వెళ్లింది. గుజరాత్‌లోని దామోద్‌లో ఒక హోటల్‌లో ఉన్న చెడ్డీ గ్యాంగ్ ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని రాచకొండ పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారులు ఇంకా నిర్ధారించలేదు. రెండు రోజుల్లో అరెస్టు చేసిన చెడ్డీ గ్యాంగ్‌ను పోలీసులు నగరానికి తీసుకురానున్నారు. చెడ్డీ గ్యాంగ్‌ దోచుకున్న సొత్తును ప్రస్తుతం పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఈ గ్యాంగ్‌లో మరికొంతమంది సభ్యులు పరారీలో ఉన్నారు.