కానిస్టేబుల్‌ ఇంట్లో భారీ చోరీ

కానిస్టేబుల్‌ ఇంట్లో భారీ చోరీ

తాళం వేసి ఉన్న కానిస్టేబుల్‌ ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఉపేందర్‌ కుటుంబంతో కలిసి పట్టణంలో నివాసముంటున్నాడు. కాగా, ఉపేందర్‌ భార్య కోటేశ్వరి సోమవారం కోదాడలో ఉంటున్న బంధువుల ఇంట్లో జరుగుతున్న పుట్టిన రోజు వేడుకకు వెళ్లగా రాత్రి అతను ఇంటికి తాళం వేసి విధులకు హాజరయ్యేందుకు వెళ్లాడు.

గమనించిన దుండగులు ఇంటి తలుపుల గడియ పగులగొట్టి, లోనికి ప్రవేశించారు. బీరువా పగులగొట్టి అందులోని నక్లెస్, హారాలు, గొలుసులు చెవుల దిద్దులు తదితర 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు 4 లక్షల నగదును అపహరించుకుపోయారు. మంగళవారం ఉదయం ఉపేందర్‌ ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తీసి ఉండడంతో చోరీ విషయాన్ని గుర్తించి నేరేడుచర్ల ఎస్సై నవీన్‌కుమార్‌కు తెలియజేయగా ఘటనస్థలాన్ని పరిశీలించారు.

సూర్యాపేట నుంచి క్లూస్‌టీం బృందం వచ్చి వేలు ముద్ర నమూనాలను సేకరించారు. కోదాడ డీఎస్పీ రఘు, హుజూర్‌నగర్‌ సీఐ రామలింగారెడ్డి, పాలకవీడు ఎస్సై సైదులు కానిస్టేబుల్‌ ఉపేందర్‌ నివాసానికి వచ్చి వివరాలు అడిగి తెలసుకున్నారు. ఉపేందర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీ¯Œ కుమార్‌ తెలిపారు.