వచ్చేవారం కానిస్టేబుల్ ఫలితాలు!

constable results release next week

-భర్తీకానున్న 16,925 పీసీ పోస్టులు
-ఫలితాల విడుదలకు టీఎస్‌ఎల్పీఆర్బీ కసరత్తు

ఎస్సై ఫలితాలు వెలువడటంతో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) అధికారులు.. కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాల విడుదలపై కసరత్తు ముమ్మరంచేశారు. వారంరోజుల్లో ఈ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీసహా ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 16,925 మంది కానిస్టేబుళ్లు భర్తీ కానున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మొత్తం 1,272 ఎస్సై, తత్సమాన పోస్టులకు టీఎస్‌ఎల్పీఆర్బీ రెండ్రోజుల క్రితం తుది ఫలితాలు వెల్లడించింది.

వీరందరికీ త్వరలోనే మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో తొలుత కానిస్టేబుల్ ఫలితాల తర్వాత ఎస్సై పోస్టులకు తుది ఫలితాలు వెలువడేవి. దీంతో తొలుత కానిస్టేబుళ్లుగా సెలక్టయిన అభ్యర్థులు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోతామోనన్న భయంతో ఆ ఉద్యోగంలో చేరేవారు. తర్వాత వీరిలో 10 నుంచి 15 శాతం వరకు అభ్యర్థులు ఎస్సైకి ఎంపికయ్యేవారు. దీంతో బ్యాక్‌లాగ్‌పోస్టులు మిగిలేవి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈసారి రిక్రూట్‌మెంట్‌లో తొలుత ఎస్సై, తర్వాత కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగిస్తూ వచ్చారు. తుది ఫలితాల్లోనూ ఇదే పద్ధతి పాటిస్తున్నారు.