గాడిదపాలు తాగిస్తే ఆరోగ్యానికి మేలు

గాడిదపాలు తాగిస్తే ఆరోగ్యానికి మేలు

ప్రస్తుతం సమాజంలో గాడిద పాలకు మంచి డిమాండ్‌ ఉంది. గాడిదపాలు తాగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం చేస్తూ పాలను విక్రయిస్తున్నారు. గాడిద పాలు కూడా తాగే వారి సంఖ్య పెరగడంతో ఈ పాలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. కరము పాలు గరిటడైనా చాలు అన్నట్లుగా.. గాడిద పాలు తాగితే పలు రకాల మొండి వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని గాడిద పాల విక్రయదారులు అంటున్నారు.

ఇందులో నిజమెంతో తెలీదు కానీ, గాడిద పాలను కూడా అనేక మంది కొనుగోలు చేసి తాగుతున్నారు. మంచిర్యాలకు చెందిన కొంతమంది యువకులు మూడు గాడిదలతో ప్రతి సంవత్సరం ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు పాల్వంచ పట్టణ, మండలంలో ఊరూరా తిరుగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు.

పాలు కావాలంటే ఇంటివద్దనే గాడిదపాలను పితికి అక్కడిక్కడే ఇస్తారు. అర టీ కప్పు గాడిద పాలు చిన్న పిల్లలకు రూ.150, పెద్దలకు ఒక టీ కప్పు రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ గాడిద పాల విక్రయదారులు రోజుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. గిరాకీ ఉంటే అంతో ఇంతో ఆదాయం లభిస్తుందని, అది కూడా గాడిద పాల గురించి తెలిసిన వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు.

టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో రకరకాల ఆహార పదార్థాలు వచ్చాయని దీంతో గాడిద పాలకు కాస్తా గిరాకీ తగ్గిందంటున్నారు. దగ్గు, దమ్ము, ఆస్తమా, గురక వంటి వ్యాధులను గాడిద పాలు తాగితే పూర్తిగా తగ్గిపోతుందని, ఈ పాలల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయని నిర్వాహకులు ప్రచారం చేస్తూ గాడిద పాలను విక్రయిస్తున్నారు.