తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటికి కూడా పార్టీల పరంగా లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన మహిళను వైకాపా సర్పంచి అనుచరుడు ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేసిన ఘటనపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘సామినిబాయిని ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటన కలచివేసింది.
తాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లనే పేరుతో అడ్డుకుం టారా? నీళ్లు లేవని ప్రాధేయపడినా.. ట్రాక్టర్తో తొక్కించి చంపడాన్ని ఏమనాలి? ఘటనపై అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విచారణ చేపట్టాలి. వైకాపా వాళ్లే నీరు తాగాలి.. వైకాపా వాళ్లే గాలి పీల్చాలి అనే రీతిలో భవిష్యత్తులో జీవో ఇస్తారేమో.. పంచభూతాలకు సైతం పార్టీ రంగులు పులిమే దుర్మార్గపు పాలన ఏపీలో రాజ్య మేలుతోంది. ఈ పాలకుడు మాట్లాడితే నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. అంటారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తూ, ఎస్టీ మహిళను ట్రాక్టర్ తో తొక్కించేస్తూ హత్యాకాండ సాగించేవాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తికి నా ఎస్టీ.. నా ఎస్సీ అనే అర్హత నీకుందా? అని ప్రశ్నించారు.