జమ్మూ కశ్మీర్లో ఎన్‌కౌంటర్

జమ్మూ కశ్మీర్లో ఎన్‌కౌంటర్

జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కశ్మీర్లోని షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో.. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు వెల్లడించారు. వారిద్దరూ లష్కరే తో యిబాకు చెందిన వారని భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని.. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

ఉగ్రవాదులు ఉన్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సెక్యూరిటీ ఫోర్స్ చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారింది. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు ఎవరనేది పోలీసులు ధ్రువీకరించకపోయినప్పటికీ.. ఒకరు షోపియాన్ జిల్లాకు చెందిన వారు కాగా, మరొకరు పుల్వామా జిల్లాకు చెందిన వ్యక్తి అని సమాచారం.

శుక్రవారం రోజు అనంతనాగ్ జిల్లాలోని ముమన్‌హల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాది షహజాద్ అహ్మద్ షాను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కాగా చలి కాలంలో కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు పెరుగుతుంటాయి. అతి శీతల పరిస్థితుల్లో భద్రతా దళాల కన్నుగప్పి పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు సరిహద్దు దాటి కశ్మీర్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంటారు. దీంతో భద్రతా దళాలు సైతం అప్రమత్తంగా ఉంటూ.. ఉగ్ర కదలికలను నిశితంగా గమనిస్తుంటాయి.