సోషల్ మీడియాలో ఫేస్ బుక్ కి ప్రత్యేక స్థానం ఉంది. కోట్ల మంది యూజర్లున్నారు. అదే సమయంలో ఎన్నో వివాదాలూ ఉన్నాయి. అలాంటి ఈ సంస్థ తన బ్రాండ్ నేమ్ ను మార్చుకోబోతున్నట్లు టెక్ ప్రపంచంలో ఫీలర్స్ రిలీజ్ అయ్యాయి. అక్టోబర్ 28న జరిగే కంపెనీ వార్షిక సమావేశంలో సీఈవో మార్క్ జుకర్ బెర్గ్ Facebook పేరును మార్చబోతున్నట్లు తెలిసిందిది. అసలు ఫేస్ బుక్ తన పేరును ఎందుకు మార్చాలనుకుంటోంది? అని చాలా మంది టెక్ ప్రియులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నకు కంపెనీ నుంచి సరైన సమాధానం రాలేదు.ఫేస్ బుక్ వచ్చే ఐదేళ్లలో యూరప్ మార్కెట్ ను శాసించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు దాని ప్రతినిధులు అనౌన్స్ చేశారు.
అంతేకాకుండా మెటావర్స్ ను బిల్డ్ చేయాలని చూస్తున్నట్లు కూడా తెలిపారు. దీని మీదనే కంపెనీ భవిష్యత్ ఆధారపడి ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.జరగబోయే యాన్యూవల్ మీట్ లో ఫేస్ బుక్ సీఈవో జుకర్ బెర్గ్ ఏం చెప్పబోతున్నారు అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దిగ్గజ సంస్థ అయిన ఫేస్ బుక్ కింద ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఉన్నాయి. వాట్సాప్ , ఇన్ స్టాగ్రామ్ లాంటి ఎన్నో సంస్థలకు ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీలా ఉంది. ఇలాంటి అందరికీ తెలిసిన కంపెనీ పేరు మారబోతోందంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. పేరు మార్చితే ఫేట్ మారిపోతుందా అనే ప్రశ్న కూడా కొందరి నుంచి వస్తోంది.
వేల మంది ఫేస్ బుక్ ఉద్యోగులు సంస్థ కు కొత్త హార్డ్ వేర్ ను అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. AR glasses అని పిలిచే ఈ విధానం గురించి సీఈవో జుకర్ బెర్గ్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. వచ్చే ఐదారేళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఫేస్ బుక్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. నిజానికి ఫేస్ బుక్ ని అందరూ పెద్ద సోషల్ మీడియా కంపెనీగా మాత్రమే చూస్తారు. కానీ ఫేస్ బుక్ తమ పేరు వింటే ఇక సోషల్ మీడియా కంపెనీగా కాకుండా ప్రముఖ మెటావర్స్ కంపెనీలా చూడాలని భావిస్తోంది. కంపెనీకి మెటావర్స్ గా పేరు తెచ్చేందుకు ఫేస్ బుక్ ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కంపెనీ సీఈవో మార్క్ జకర్ బెర్గ్ మాట్లాడుతూ.. మెటావర్స్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో చాలా ప్రభావవంతంగా పని చేయబోతుందని తెలిపారు. టెక్నాలజీలో బిగ్ పార్ట్ కాబోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇది మొబైల్ ఇంటర్ నెట్ ను శాసిస్తుందని తెలిపారు.ఫేస్ బుక్ ప్రస్తుతం చాలా విమర్శలను ఎదుర్కుంటోంది. కస్టమర్ల ప్రైవసీ వివరాల్ని ఫేస్ బుక్ లీక్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని చెరిపేసుకునేందుకు కంపెనీ తీవ్రంగా యత్నిస్తోంది.
ఇప్పటికే ఆ కంపెనీ సీఈవో అయిన మార్క్ జుకర్ బెర్గ్ స్వయంగా హాజరై తన వాదనలు వినిపిస్తూ ప్రజెంటేషన్స్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. అమెరికాలోని కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు ఫేస్ బుక్ ను వదలడం లేదు. సెనేట్ కమిటీ ముందు ఫేస్ బుక్ ప్రతినిధులు హాజరు కావాల్సి కూడా వచ్చింది. ఫేస్ బుక్ కంపెనీ ప్రతినిధి ఒకరు “మేము పుకార్లు, ఊహాగానాలపై మాట్లాడదలచుకోలేదు’ అని అన్నారు.తన పేరును మార్చుకునే టెక్ కంపెనీల్లో ఫేస్ బుక్ మొదటిది కాదు.
ఇప్పటికే అనేక టెక్ కంపెనీలు తమ పేర్లను మార్చుకున్నాయి. కేవలం సెర్చ్ ఇంజిన్ గా మాత్రమే ఉన్న గూగుల్ 2015లో ఆల్ఫాబెట్ కంపెనీగా మారి సెర్చ్ ఇంజిన్ లా మాత్రమే కాకుండా డ్రైవర్ లెస్ కార్లు కూడా గూగుల్ నుంచి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.2016లో Snapchat కూడా తన పేరును మార్చుకున్న టెక్ కంపెనీల జాబితాలో చేరింది. అప్పటివరకు సోషల్ మీడియాకే పరిమితమైన సంస్థ కాస్తా టెక్నాలజీతో కూడిన కళ్లజోళ్లను తయారు చేసింది. తన కళ్లజోడును మార్కెట్ లోకి రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.