Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో… అన్ని నష్టాలూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజల భావవ్యక్తీకరణకు వేదిక అయినట్టుగానే… వ్యతిరేక ప్రచారానికీ సాధనంగా మారింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా ఎంత ప్రయోజనం పొందుతున్నాయో అంతే స్థాయిలో నష్టపోతున్నాయి కూడా. అన్నిపార్టీలు ప్రత్యర్థిపార్టీలపై కక్ష సాధింపుకు సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాపై ఎన్ని వివాదాలు నడిచాయో చూశాం. ఈ వివాదాలు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అసత్యాలు ప్రచారమవుతున్నాయి. వైరల్ అవుతోన్న విషయం సరైనదా కాదా అని ఆలోచించే తీరికా, ఓపికా నెటిజన్లకు ఉండదు కాబట్టి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే రాజకీయ పార్టీలకు ఈ అసత్యప్రచారాన్ని తిప్పికొట్టే అవకాశం లభిస్తోంది. తాజాగా గుజరాత్ ఎన్నికలే లక్ష్యంగా జరిగిన ఓ ప్రచారమే ఇందుకు ఉదాహరణ.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత… సోషల్ మీడియాలో ఓ ఫొటో విపరీతంగా షేర్ అయింది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోఫాలో కూర్చుని ఉండగా… పోలీసు వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి ఆయన కాళ్లు పట్టుకున్నట్టుగా ఆ ఫొటోలో ఉంది. తొలుత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రొఫైల్ ఫొటో పెట్టుకున్నఆలంగిర్ రిజ్వీ అనే వ్యక్తి ఈ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. గుజరాత్ డీజీపీ రాజ్ నాథ్ కాళ్లు పట్టుకున్నారని, ఇది చూశాక ఎన్నికలు సామరస్యంగా జరుగుతాయన్న నమ్మకం తనకు లేదని, ఎవరిని నమ్మాలో అర్ధం కావడం లేదని ఆలంగిర్ ట్వీట్ చేశాడు. ఈ ఫొటో నెట్ లో వైరల్ అయింది. ఆలంగిర్ ట్వీట్ ను నమ్మిన నెటిజన్లు ఫొటోను షేర్ చేస్తూ రాజ్ నాథ్ పై విమర్శలు గుప్పించారు. తర్వాత ఫొటో అసలు సంగతి బయటకు వచ్చింది.
మాజీ ఐపీఎస్ అధికారి యోగేశ్ ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన క్యా యే సచ్ హై అనే చిత్రంలోనిది ఈ ఫొటో అన్న విషయం వెల్లడయింది. ఫొటోలో ఉన్న వ్యక్తి మొహాన్ని మార్ఫింగ్ చేసి రాజ్ నాథ్ ఫొటో పెట్టారు. ఈ విషయం తెలియని నెటిజన్లు రాజ్ నాథ్ డీజీపీ స్థాయి వ్యక్తితో కాళ్లు పట్టించుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు సంగతి తెలిసిన తరువాత… నెటిజన్లు, జర్నలిస్టులు ఆలంగిర్ రాజ్ నాథ్ ఫొటోను తొలగించి క్షమాపణ చెప్పాలని కోరారు. కానీ ఆలంగిర్ అందుకు అంగీకరించలేదు. దీనిపై రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. అసలు ఆ ఫొటోనే తనది కానప్పుడు డీజీపీ తన కాళ్లు ఎలా పట్టుకుంటారని ప్రశ్నించారు. బీజేపీ పై దుష్ప్రచారం చేయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు సంగతి బయటకు వచ్చింది కాబట్టి… ఎలాంటి సమస్యాలేదు… కానీ లేకపోతే గుజరాత్ ఎన్నికలపై ఈ ఫొటో ప్రభావం ఎంతో కొంత కనిపించేది. ఇలాంటి అనేక అసత్య ప్రచారాలకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల సత్తా ఉంది. అందుకే అన్ని పార్టీలు సోషల్ మీడియా అంటే హడలిపోతున్నాయి.