నిశ్చితార్థం రద్దు కావడంతో యువతి ఆత్మహత్య

నిశ్చితార్థం రద్దు కావడంతో యువతి ఆత్మహత్య

నిశ్చితార్థం రద్దు కావడంతో ఓ యువతి ఉరివేసుకొని తనువు చాలించింది. రెండు కుటుంబాలు పట్టింపులకు వెళ్లడంతో మనస్తాపానికి గురైంది. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని పెండ్యాల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మహేశ్వరం సీఐ మధుసూదన్, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చామలేటి చంద్రయ్య, లావణ్య దంపతుల కూతురు ప్రగతి డిగ్రీ వరకు చదువుకుంది.

మండల పరిధిలోని అమీర్‌పేట్‌ గ్రామానికి చెందిన కార్తీక్‌తో ఆమెకు వివాహం నిశ్చయమైంది. గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ఇరు కుటుంబపెద్దలు పట్టింపులకు పోవడంతో ఆదివారం దానిని రద్దు చేసుకున్నారు. వివాహం చేసుకునేందుకు ప్రగతి, కార్తీక్‌కు ఇష్టం ఉన్నా నిశ్చితార్థం ఆగిపోవడంతో యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంట్లో చీరతో ఫ్యాన్‌ కొక్కేనికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఉదయం 6 గంటలకు ప్రగతిని నిద్రలేపేందుకు వెళ్లిన తల్లి ..వేలాడుతున్న మృతదేహాన్ని చూసి షాక్‌కు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. ప్రగతి ఫోన్‌ కాల్‌డేటాను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగార్జున తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.