కస్టమర్లకు గుడ్ న్యూస్

కస్టమర్లకు గుడ్ న్యూస్

బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్, కారు లోన్ తీసుకునే వారికి వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం నుంచి తగ్గించిన వడ్డీ రేట్లు అమల్లోకి వస్తున్నట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో హోమ్ లోన్, కారు లోన్ కస్టమర్లకు ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది. హోమ్ లోన్ వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.40 శాతం వరకు తగ్గిస్తున్నట్టు బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది. అలాగే కారు లోన్ వడ్డీరేటును 7.05 శాతం నుంచి 6.80 శాతానికి తగ్గించింది. హోమ్ లోన్‌పై 40 బేసిస్ పాయింట్లు, కారు లోన్‌పై 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లకు కోత పెట్టింది.

వడ్డీ రేట్ల తగ్గింపు కోసం బ్యాంకు ‘రిటైల్ బొనాంజా ఫెస్టివ్ ధమాకా’ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద, కస్టమర్లు హోమ్, కారు లోన్లను తగ్గింపు వడ్డీ రేట్లకు పొందవచ్చని చెప్పింది. ఈ ఆఫర్ కింద కొత్త వడ్డీ రేట్లపై సోమవారం నుంచే బ్యాంకు లోన్లను జారీ చేస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతోన్న సమయంలో బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో కీలకంగా మారింది. హోమ్ లోన్, కారు లోన్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేయడం ద్వారా, బ్యాంకు మరింత మంది కస్టమర్లను చేరుకుంటుందని పేర్కొంది.

బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర రిటైల్ లోన్లపై ఎక్కువగా ఫోకస్ చేసింది. రిటైల్ లోన్ల కింద హౌసింగ్ లోన్ సెగ్మెంట్ ఏడాదిలోనే 20.35 శాతం పెరిగింది. అదే విధంగా కారు లోన్ సెగ్మెంట్ కూడా 27.15 శాతం ఎగిసింది. ఈ రెండు లోన్లకు కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. అంతకుముందు పండగల సీజన్‌లో కూడా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర గోల్డ్, హౌసింగ్, కారు లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. మార్కెట్‌లో అత్యంత తక్కువ వడ్డీరేటుకు రిటైల్ లోన్లను బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఆఫర్ చేస్తుందని బ్యాంకు సీఈవో, ఎండీ ఏఎస్ రాజీవ్ తెలిపారు. ముఖ్యంగా హోమ్ లోన్, కారు లోన్ సెగ్మెంట్లలో భారీ మొత్తంలో డిస్కౌంట్లను కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.