Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ మలిదశ ఉద్యమం… స్వతంత్ర భారత చరిత్రలోనే ఈ ఉద్యమం అత్యంత ప్రాధాన్యమైనది. స్వాతంత్రోద్యమం తర్వాత దేశంలో మళ్లీ ఆ స్థాయిలో చెప్పుకోతగ్గ ఉద్యమం తెలంగాణ పోరాటం. ఈ ఉద్యమ కాలంలో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసింది. దేశం నలుమూలలా తెలంగాణ గురించి చర్చ జరిగింది.నిజానికి స్వతంత్ర ఉద్యమ కాలంలో మనుషుల ఆలోచనా విధానం వేరు. ఇప్పటిలా వ్యక్తిగత సుఖాలు, కెరీర్, విలాసాలు అప్పటి ప్రజల జీవితంలో అంత ప్రభావం చూపేవి కావు. సమాజంతో పాటుగా ముందుకుసాగేవారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, సంపాదనే జీవిత పరమార్థంగా భావించే ఆలోచనా విధానం ఆనాడు కానరాదు. తమ స్వార్థం కోసం ముందూ, వెనకా ఆలోచించకుండా ఉండే తత్వం అప్పటి ప్రజల్లో లేదు. అందుకే విభిన్నమతాల, కులాల కలయికయినప్పటికీ… ప్రజలంతా దేశం కోసం ఒక్కతాటిపైకి వచ్చారు. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమకాలంలో పరిస్థితి అది కాదు. యువతీయువకులంతా కెరీర్ వేటలో పరుగులు తీసేవారే.
సంపాదనే సమాజంలో మనిషి స్థితిని నిర్ణయించే కాలం. ఎవరి జీవితం వారిది. ఎవరి లక్ష్యాలు వారివి. ఎవరి ప్రాధామ్యాలు వారికున్నాయి. కెరీర్ కోసం, విద్యా,ఉద్యోగాల కోసం దేన్నయినా వదులుకునేలా మారిన ప్రజల ఆలోచనావిధానం…ఓటు వేయడాన్ని టైమ్ వేస్ట్ వ్యవహారంగా భావించే యువతరం… దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో మలిదశ ఉద్యమం మొదలయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఆయన నిర్ణయాలు, పథకాలు తనదైన శైలిలో సాగిపోతున్నాయి. ఈ తరుణంలో ఎనిమిదేళ్లగా ఒకేరీతిలో కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి మొదలయింది. రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాలు, ఎన్నికల గెలుపోటముల ఆటలో తెలంగాణకు ఏమీ లాభం కలగడంలేదన్న స్పృహ ప్రజల్లో పెరిగింది. విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్జీవోలు, విప్లవకారులు ఇలా అన్ని వర్గాల వారినుంచీ కేసీఆర్ పై ఒత్తిడి పెరగసాగింది. ఈ అసంతృప్తులు కొనసాగుతుండగానే 2009 సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండు నెలలు గడిచాయి. రోశయ్యను గద్దె దించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. తెలంగాణ సమాజం మాత్రం ఈ రాజకీయాలు పట్టించుకోలేదు. తెలంగాణ ఆకాంక్ష బలంగా వినిపించడంపైనే దృష్టిపెట్టింది. ఈ పరిస్థితుల్లోనే కేసీఆర్ పోరుబాట ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ ఊరూ, వాడను కదలించింది. అన్ని వర్గాలూ కేసీఆర్ కు మద్దతుగా నిలిచాయి. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రజల్లో ఉవ్వెత్తున ఎగిసింది. 2009 నవంబర్ చివరి వారంలో కేసీఆర్ ప్రారంభించిన నిరాహార దీక్ష తెలంగాణ సమాజాన్నంతటినీ ఏకతాటిపైకి తెచ్చింది. దీక్షా స్థలికి వెళ్లకుండానే కేసీఆర్ ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు అందరూ రోడ్లపైకి వచ్చారు. ప్రత్యేక ఆకాంక్షను బలంగా వినిపించాలనే క్రమంలో యువత బలిదానాలకు సిద్దమయింది.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని శ్రీకాంతాచారి అనే విద్యార్థి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడం….రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తెలంగాణ అంతటా ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఉస్మానియా యూనివర్శిటీ ఉద్యమకేంద్రంగా మారింది. కేసీఆర్ జైలులో దీక్ష కొనసాగిస్తుండడంతో తెలంగాణ అంతటా ఆయనకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు కేంద్రం అదనపు బలగాలు మోహరించడంతో తెలంగాణలో ఎక్కడచూసినా పోలీసులే కనిపించేవారు. జైలులో కొన్నిరోజుల దీక్ష తర్వాత….కేసీఆర్ సన్నిహితుల సూచనమేరకు తనంత తానుగా దీక్ష విరిమించనట్టు వార్తలొచ్చాయి. దీక్ష విరమణ సందర్బంగా చేసిన ప్రసంగంలో కేసీఆర్ ఉస్మానియా విద్యార్థులు తీరును తప్పుబట్టడం, పోలీసులపై దాడిని ఖండించడంపై తెలంగాణ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.
గద్దర్ వంటి నాయకులతో పాటు… ఉస్మానియా విద్యార్థులంతా కేసీఆర్ పై ఎదురుదాడికి దిగారు. ఈ తరుణంలో కేసీఆర్ మళ్లీ దీక్ష కొనసాగించారు. జైలులో ఆయనకు అనారోగ్యం కలగడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో చికిత్స పొందుతూనే దీక్ష కొనసాగిస్తున్న కేసీఆర్ పరిస్థితి విషమించినట్టూ వార్తలొచ్చాయి. తెలంగాణ ప్రజలంతా పోరాటం కొనసాగించారు. ప్రత్యేక ఆకాంక్షను ఢిల్లీ దాకా వినిపించారు. తెలంగాణ అంతటా బంద్ వాతావరణం నెలకొని ఉండేది. ఈ పరిస్థితుల్లోనే 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత ఆ రాత్రే కేసీఆర్ దీక్ష విరమించారు. కేసీఆర్ దీక్షకు తలొగ్గి కేంద్రం చేసిన ఆ ప్రకటన ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో దావానలంలా మారింది. తెలంగాణ విడిపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. చిదంబరం ప్రకటన రాజకీయవర్గాల్లో పెను సంచలనం రేపింది. కేంద్రం ప్రకటనను నిరసిస్తూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేశారు.
ఆయన రాజీనామాతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజీనామాల పరంపర మొదలయింది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటాపోటీగా రాజీనామాలు సమర్పించారు. ఏపీలో ఆందోళనలు మొదలయ్యాయి. సమైక్యాంధ్ర కోసం లగడపాటి దీక్ష చేశారు.తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ విద్యార్థులు, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. ఆంధ్రయూనివర్శిటీలో నిరాహార దీక్ష చేస్తూ ఓ విద్యార్థి సమైక్యాంధ్ర కోసం ప్రాణార్పన చేశాడు. శాంతి భద్రతలు అదుపుతప్పకుండా అదనపు బలగాలు మోహరించడంతో ఏపీలోనూ ఎక్కడ చూసినా సీఆర్పీఎఫ్ బలగాలే కనిపించేవి. ప్రజల ఆందోళనలు, బంద్ లతో జనజీవనం గాడితప్పింది. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. తన ప్రకటనను వెనక్కి తీసుకుని రాష్ట్ర ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై శ్రీకృష్ణకమిటీని నియమిస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ పర్యటించి అందరి అభిప్రాయాలూ సేకరించిన కమిటీ ఆరు ప్రతిపాదనలతో నివేదిక అందించింది. అటు చిదంబరం ప్రకటనతో తెలంగాణ వచ్చేసినట్టే అని భావించిన తెలంగాణ యువతకు తర్వాత జరిగిన పరిణామాలు నైరాశ్యం కలిగించాయి.
ఆ సమయంలో తెలంగాణలో వరుస బలిదానాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకరాష్ట్రం ఇవ్వాలని కోరుకుంటూ అనేకమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో టీఆర్ ఎస్ తో పాటు అనేక వర్గాలు తెలంగాణ ఆకాంక్ష వ్యక్తీకరించేందుకు వీలుగా జేఏసీలు ఏర్పడి దీక్షలు, ఆందోళనలు కొనసాగించాయి. రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సహా ఎంతో మంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి కేంద్రప్రభుత్వం అధికారికంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన 2013 జులై దాకా యావత్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష బలంగా వ్యక్తపరిచింది. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటి కార్యక్రమాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యానికి లోనయింది. చదువు, కెరీర్ కోసం ఉరుకులు పరుగులు తీస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న యువత…మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలకు వెల్లువలా తరలిరావడం తెలంగాణ ఉద్యమం తీవ్రతకు అద్దం పట్టింది.
టీఆర్ ఎస్ బంద్ కు పిలుపునిస్తే…రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారేవి. టీఆర్ ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు రోడ్లపైన, రైల్వేట్రాక్ లపైనా సామూహిక భోజనాలు చేయడం…తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉందో తెలియజేసింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది. కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా….ఏపీలో తీవ్రస్థాయిలో వ్యక్తమయిన ఆగ్రహజ్వాలలు…తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేకపోయాయి. అప్పటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ…కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకే మొగ్గుచూపింది. కేటీఆర్ చెప్పినట్టు కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు చివరిముఖ్యమంత్రిగా మిగిలారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ పార్లమెంట్ లో తీర్మానం ఆమోదింపజేసింది. ఆ తీర్మానంతో తెలంగాణ ప్రజల ఆశయం, ఆకాంక్ష తీరాయి. అసాధ్యమనుకున్నది సరిగ్గా ఎన్నికలకు ముందు సుసాధ్యమయింది. ఆ క్షణం నుంచే తెలుగు ప్రజల్లో రాష్ట్రం విడిపోయిందన్న భావన మొదలయింది.
సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం కల నెరవేర్చిన టీఆర్ ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అటు ఏపీలో టీడీపీ గెలుపొందింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. కొత్త రాష్ట్రానికి జూన్ 2ను అప్పాయింట్ మెంట్ డే గా నిర్ణయించారు. జూన్ 1 అర్ధరాత్రి తెలంగాణ అంతటా ఆవిర్భావ వేడుకలు మొదలయ్యాయి. ట్యాంక్ బండ్ కు లక్షలాదిగా తరలిచ్చిన తెలంగాణ వాసులు భావోద్వేగాల మధ్య ఉత్సవాలు జరుపుకున్నారు. తెలంగాణ అంతటా జూన్ 2న పండుగ వాతావరణం నెలకొంది. ఇది జరిగి నాలుగేళ్లు గడిచిపోయాయి. అప్పటినుంచి ఏటా జూన్ 2న తెలంగాణలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ ఏడాది వేడుకలు జరగనున్నాయి.