తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. జల్ జీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి గ్రామీణ భారతంలో ప్రతి ఇంటికీ నల్లా నీరు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడులో పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది. ఇలాంటి పరిస్థితి తెలంగాణకు రాకూడదన్న ముందుచూపుతోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మిషన్ భగీరథకు రూపకల్పన చేశారు.
ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు సరఫరా చేసే పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 22,403 గ్రామాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా శుద్ధి చేసిన జలాన్ని అందిస్తున్నారు. ఈ పథకం తరహాలోనే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌ను రూపొందించింది. ఈ పథకం అమలును పర్యవేక్షించే జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.28,261.59 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునురుజ్జీవనం, తాగు నీరు, పారిశుద్ధ్య శాఖలన్నింటినీ ఏకం చేసి కేంద్రం కొత్తగా జల్‌శక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. తాగునీరు, పారిశుద్ధ్య విభాగానికి 2018-19లో రూ.19,992.97 కోట్లు కేటాయించగా, ఈసారి 20,016.34 కోట్లు కేటాయించారు.
నీటి వనరులు, గంగా పునరుజ్జీవన శాఖకు ఈసారి రూ.8,245.25 కోట్లు కేటాయించగా, 2018-19లో రూ.7,269.25 కోట్లు కేటాయించారు. జాతీయ నదీ సంరక్షణ ప్రణాళికకు ఈసారి కేటాయింపులు తగ్గాయి. 2018-19లో 1,620 కోట్లు కేటాయించగా, ఈ సారి 1,220 కోట్లు కేటాయించారు. వచ్చే దశాబ్ద కాలానికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో నీరు, నీటి సంరక్షణ, పరిశుద్ధ నదులు కూడా ఒక అంశమని సీతారామన్ వెల్లడించారు. దేశానికి నీటి భద్రత, ప్రతి ఒక్కరికీ సురక్షిత మంచినీరు అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి ప్రతి గ్రామీణ కుటుంబానికి రక్షిత నీరు అందించేందుకు జల్ శక్తి శాఖ అన్ని రాష్ర్టాలతో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. వాన నీటి సంరక్షణ, మురుగు నీటి శుద్ధికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. మురుగునీటిని సాగుకు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం తీసుకువస్తామని తెలిపారు. 256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్ అమలుచేయనున్నట్లు పేర్కొన్నారు.
స్వచ్ఛభారత్ పథకాన్ని విస్తృతపరుస్తాం..
స్వచ్ఛభారత్ పథకాన్ని మరింత విస్తరిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రతిగ్రామంలోనూ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపడతామన్నారు. దేశంలోని అన్ని పట్టణాలను ఇప్పటికే 95 శాతం బహిరంగ మల విసర్జన రహితంగా మార్చామని, 2014 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 9.6 కోట్ల మరుగుదొడ్లను నిర్మించినట్లు చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి స్వచ్ఛభారత్ మిషన్‌ను సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. కొత్తగా 10000 రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. పట్టణీకరణను ప్రభుత్వం ఒక సవాల్‌గా కాకుండా అవకాశంగా చూస్తున్నదని చెప్పారు.