గుండెపోటుతో కన్నుమూసిన జశ్వంత్‌ సింగ్

గుండెపోటుతో కన్నుమూసిన జశ్వంత్‌ సింగ్

కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జశ్వంత్‌ సింగ్‌(82) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చాన్నాళ్లుగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మాజీ ఆర్మీ అధికారి అయిన జశ్వంత్‌ సింగ్‌ మాజీ ప్రధాని అటల్‌ బిçహారీ వాజ్‌పేయికి సన్నిహితుల్లో ఒకరు. జశ్వంత్‌ సింగ్‌ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పార్టీలకతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

కేంద్రంలో ఆయన ఆర్థిక, రక్షణ, విదేశాంగ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 2014లో తన ఇంట్లో ఆయన కింద పడి, తీవ్రంగా గాయపడడంతో ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ వైద్యశాలలో చేర్చి చికిత్స చేశారు. ఆ తరువాత కూడా పలు అస్వస్థతలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ జూన్‌లో మరోసారి ఆస్పత్రిలో చేరారు. ‘కేంద్ర మాజీ మంత్రి, మేజర్‌(రిటైర్డ్‌) జశ్వంత్‌ సింగ్‌ సెప్టెంబర్‌ 27 ఉదయం 6.55 గంటలకు మరణించారు. 25 జూన్, 2020లో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి సెప్సిస్, మల్టీ ఆర్గాన్‌ డిస్‌ఫంక్షన్‌ సిండ్రోమ్, గతంలో తలకు తగిలిన దెబ్బకు చికిత్స అందిస్తున్నాం. ఆదివారం ఉదయం తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది.

ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు’ అని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రి ఒక ప్రకటనలో వివరించింది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. జశ్వంత్‌ సింగ్‌ కుమారుడు మానవేంద్ర సింగ్‌ అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సైనికుడు, సమర్థుడైన పార్లమెంటేరియన్, అద్భుతమైన నాయకుడు, మేధావి అయిన జశ్వంత్‌ సింగ్‌ మృతి తననెంతో కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. దేశానికి జశ్వంత్‌ సింగ్‌ ఎన్నో సేవలందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మానవేంద్ర సింగ్‌కు ప్రధాని ఫోన్‌ చేసి సంతాపం తెలిపారు. జశ్వంత్‌ తనకు అత్యంత సన్నిహితుడైన సహచరుడని బీజేపీ సీనియర్‌ నేత అడ్వాణీ పేర్కొన్నారు.