క‌ల్పనాచావ్లా…అమెరికా వీర మ‌హిళ‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

భార‌త సంత‌తి వ్యోమ‌గామి దివంగ‌త క‌ల్ప‌నాచావ్లాపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల కోసం జీవితాన్ని అంకితంచేసిన క‌ల్ప‌నాచావ్లా అమెరికా వీర మ‌హిళ అని ట్రంప్ కొనియాడారు. ల‌క్ష‌లాది మంది బాలిక‌ల్లో వ్యోమ‌గామి కావాలన్న స్ఫూర్తిని ఆమె నింపార‌ని ప్రశంసించారు. క‌ల్ప‌నాచావ్లా రోద‌సీలోకి వెళ్లిన  తొలి భార‌త సంత‌తి మ‌హిళ‌ని, స్పేస్ ష‌టిల్ స‌హా వేర్వేరు ప్ర‌యోగాల కోసం ఆమె అంకిత‌భావంతో ప‌నిచేశార‌ని ట్రంప్ తెలిపారు. 2003లో స్పేస్ ష‌టిల్ కొలంబియా ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన క‌ల్ప‌నాచావ్లాను అమెరికా చ‌ట్ట‌స‌భ‌ల‌తో పాటు నాసా అనేక పుర‌స్కారాల‌తో మ‌ర‌ణానంత‌రం గౌర‌వించాయ‌ని గుర్తుచేశారు.  ఏటా మేనెలను ఆసియా-ప‌సిఫిక్ అమెరికా వార‌సత్వ మాసంగా ప్ర‌క‌టిస్తూ వాషింగ్ట‌న్ లో ఉత్త‌ర్వులు జారీచేసిన సంద‌ర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంనుంచి వ‌చ్చి అమెరికానే సొంత దేశంగా మార్చుకున్న‌వారి వ‌ల్ల త‌మ‌దేశం ఎంతో లాభ‌ప‌డింద‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు.