Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తృతీయ ఫ్రంట్ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రధాన జాతీయ పార్టీలు బలహీనమయిన సమయంలో కనిపించి… మూణ్నాళ్ల ముచ్చటగా మురిపించి కనుమరుగయ్యే తృతీయ ఫ్రంట్ ఈ సారి దేశరాజకీయాల్లో ఎలాంటి మార్పు తెస్తుందనేదానిపై మళ్లీ చర్చ మొదలయింది. ఈ సారి ఏర్పాటు కాబోయే తృతీయఫ్రంట్ ఆరంభంనుంచే సంచలనం. ఎందుకంటే… ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తృతీయ ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఎంతో కొంత ఉందన్న అంచనాలయితే అందరూ వేశారు కానీ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యూహం రచిస్తారని ఎవ్వరూ భావించలేదు. విభజన హామీల విషయంలో ఏపీకి చేసిన అన్యాయంపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… తృతీయఫ్రంట్ ఏర్పాటు దిశగా కదులుతారని అంతా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కేసీఆర్ తెరపైకి వచ్చారు. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం జాతీయస్థాయిలో రాజకీయ కూటమి ఏర్పాటుచేస్తానని ప్రకటించారు. కలిసి వచ్చే రాజకీయపక్షాలన్నింటినీ తృతీయ ఫ్రంట్ లో భాగస్వామిని చేసుకుంటామన్నారు.
నిజానికి తృతీయ ఫ్రంట్ ఏర్పాటులో కేసీఆర్ పైకి చెబుతున్న లక్ష్యం ఏదయినప్పటికీ… ప్రధానమంత్రి కావాలన్నది ఆయన అంతిమలక్ష్యం అన్నసంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలన్నింటినీ వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుని… ఎన్నికల్లో తృతీయఫ్రంట్ పేరుతో పోటీచేసి… ఆ ఫ్రంట్ కన్వీనర్ హోదాలో ప్రధానమంత్రి కావాలన్న కేసీఆర్ లక్ష్యం నెరవేరుతుందా…? ఈ సంగతి పక్కనపెడితే అసలు తృతీయ ఫ్రంట్ ఏర్పాటుచేసేటంత రాజకీయశూన్యం జాతీయ రాజకీయాల్లో ఉందా అన్నదానిపై చర్చసాగుతోంది. గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు జాతీయ రాజకీయాల్లో ఓ విధమైన నైరాశ్యం, నిస్పృహ ఆవరించి ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నాలుగు దశాబ్దాలపాటు సాగిన కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో పెరిగిన అసంతృప్తి, సరైన ప్రతిపక్షం లేకపోవడం వంటివి 1989లో నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావానికి దారితీశాయి. ఈ ఫ్రంట్ ఏర్పాటు సమయంలో చాలా అంచనాలే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే ఫ్రంట్ జాతీయ పార్టీల పీచమణిచి దేశరాజకీయాలను నవశకంలోకి తీసుకెళ్తుందని అందరూ భావించారు. కానీ ప్రధానమంత్రి పదవి ఎవరికి కావాలనే కుమ్ములాటలో ఫ్రంట్ మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. 1996లో ఏర్పాటయిన యునైటెడ్ ఫ్రంట్ పరిస్థితీ ఇదే.
తృతీయ ఫ్రంట్ గమనంలో ఎదురయ్యే ముఖ్య సమస్యలు, ప్రధానమంత్రి పదవి, ఏయే పార్టీలకు ఎన్నిమంత్రి పదవులు. సొంత రాష్ట్రాల ప్రాధాన్యాలు… వాటివల్ల ఫ్రంట్ లోని పార్టీల మధ్య విభేదాలు తీవ్రతరమై విఛ్చిన్నాననికి దారితీస్తుంది. జాతీయ రాజకీయాల దశ, దిశ మార్చాలనుకుంటున్న కేసీఆర్ కు ఇవన్నీ తెలియనవి కావు. కానీ ఒకప్పుడు అసాధ్యం అనిపించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి… నాలుగేళ్లగా దిగ్విజయంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ ఇప్పుడు అపార ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అందుకే తాననుకున్నది చేయగలనన్న ధీమాతో రంగంలోకి దిగుతున్నారు. అయితే కేసీఆర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే… ప్రత్యేకరాష్ట్రం ఆకాంక్ష మొత్తం తెలంగాణ సమాజంలో బలంగా వ్యక్తమయింది. వ్యక్తిగత, రాజకీయా బేధాభిప్రాయలను పక్కనపెట్టి కేసీఆర్ కు అందరూ వెన్నుదన్నుగా నిలిచారు. ప్రత్యేక ఉద్యమంలోని పరిస్థితులే కాదు… స్వాతంత్య్రం ముందునుంచీ తెలంగాణలో ఉన్న వెనుకబాటుతనం ప్రజలకు సొంతరాష్ట్రం కావాలన్న భావననుకల్పించి అందరూ ఆయన వెంట నడిచేలా చేసింది. మరి దేశంలో ఆ పరిస్థితి ఉందా..?
తృతీయ ఫ్రంట్ కావాలన్న కోరిక అసలు దేశ ప్రజల్లో ఉందా… కనీసం దక్షిణాది ప్రజల్లో ఉందా..? అంటే లేదనే చెప్పాలి. తృతీయ ప్రత్యామ్నాయం మీద దేశప్రజల్లో అంత ఆసక్తి, నమ్మకం రెండూ లేవు. అసలు చెప్పాలంటే అంత రాజకీయశూన్యతే ఇప్పుడు దేశంలో ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వంమీదా, ప్రధానమంత్రి మోడీ మీదా దేశ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నమాట నిజమే అయినప్పటికీ… అది మోడీ ప్రభుత్వాన్ని దించేసే స్థాయిలో అయితే లేదు. ఒకవేళ ఎన్నికల నాటికి పెద్దఎత్తున వ్యతిరేకత కలిగినప్పటికీ… ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తారు కానీ… ఎన్నికలకు ముందు ఏర్పాటై… కొన్నాళ్లకు కనుమరుగైపోయే తృతీయ ఫ్రంట్ మీద ఆశలు పెట్టుకోరు. ఎందుకంటే విభిన్న పార్టీల ఫ్రంట్ అనేది మన దేశంలో ఎప్పటికీ సక్సెస్ కాని ఫార్ములానే అన్నది అందరికీ తెలుసు. అది రాజకీయాల్లో తాత్కాలిక ఔషధమే తప్ప రోగం పూర్తిగా తొలగించే శస్త్ర చికిత్స ఎన్నటికీ కాలేదు… మరి ఇంట గెలిచిన ఉత్సాహంతో రచ్చగెలిచేందుకు బయలుదేరుతున్న కేసీఆర్ పాత చరిత్రనే పునరావృతం చేస్తారా… లేక కొత్త చరిత్ర సృష్టించి కల నెరవేర్చుకుంటారా అన్నది కాలమే చెప్పాలి.