షాక్ ఇచ్చిన కేటీఆర్

షాక్ ఇచ్చిన కేటీఆర్

హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నిత్యం రద్దీ ఉండే బాలానగర్ చౌరాస్త వద్ద ఇక ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. బాలనగర్ ఫ్లై ఓవర్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. అయితే వంతెన నిర్మాణ సమయంలో పనిచేసిన కార్మికురాలు శివమ్మతో మంత్రి ఫ్లై ఓవర్ ఓపెనింగ్ చేయించి అందిరికీ షాక్ ఇచ్చారు. శివమ్మతో కొత్త ఫ్లైఓవర్‌కు రిబ్బన్ కటింగ్ చేయించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మట్లాడుతూ.. కూకట్‌పల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయన్నారు. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు.

ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ను విస్తరిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో రూ.100 కోట్లతో రోడ్లు, అండర్ పాసులు నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు జేబీస్ నుంచి స్కైవే కోసం ప్లాన్ చేశామని, కేంద్రం నుంచి అనుమతి లేకపోవడంతో పెండింగ్ లోనే ఉందని కేటీఆర్ వెల్లడించారు.

మొత్తం రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రారంభంతో స్థానికులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి.