చాలా బాధాకరమైన సంఘటన

చాలా బాధాకరమైన సంఘటన

మతమార్పిడికి బలవంతం చేశారంటూ లావణ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు నెటిజన్లు. ఈ క్రమంలో కొందరు లావణ్యకు బదులుగా హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి అనే హ్యాష్‌ట్యాగ్‌ వాడుతున్నారు.

దీంతో ఓ నెటిజన్‌ సదరు హీరోయిన్‌ను చులకన చేసి మాట్లాడాడు. ‘లావణ్య త్రిపాఠి అనే హ్యాష్‌ట్యాగ్‌ వాడకండి. లావణ్య తమిళనాడుకు చెందిన సాధారణ దళిత అమ్మాయి. లావణ్య త్రిపాఠి ఒక చౌకబారు నటి. ధర్మం కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఆమెను ఆ హీరోయిన్‌తో పోల్చకండి’ అని దురుసుగా మాట్లాడాడు.

దీనిపై లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించింది. ‘నీలాంటి వాళ్లు అమ్మాయిల గురించి చీప్‌గా మాట్లాడతారు. కానీ ఏదైనా చెడు జరిగితే మాత్రం వెంటనే ఎక్కడలేని గౌరవాన్ని చూపిస్తారు. ముందు ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్చుకో! ఇది చాలా బాధాకరమైన సంఘటన. కానీ సమాజంలోని వాస్తవ పరిస్థితి ఇదే!’ అని ట్వీట్‌ చేసి గట్టి కౌంటరిచ్చింది.