సంచలనంగా మారిన లోకేష్ సాహో ట్వీట్స్ 

Lokesh Sensational tweets on Saho movie

టీడీపీ కార్యకర్తలంతా సాహో మూవీ చూడాలని పిలుపు నిచ్చారు నారా లోకేష్. అదేంటి అనుకుంటున్నారా, సాహో సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే విమర్శలపై ట్విట్టర్లో స్పందించారు  లోకేష్‌. ఇదంతా తప్పుడు ప్రచారమని, ప్రభాస్ అభిమానుల్లాగే.

.తాను కూడా సాహో చిత్రం కోసం ఎదురుచూస్తున్నానంటూ చేసిన ట్వీట్స్ సినీ, రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన సాహో మూవీ… తెలుగుతో పాటు తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేస్తోంది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తమిళనాడు వెళ్లిన ప్రభాస్ అక్కడ వైసీపీ అధినేత జగన్ గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ పనితీరును ప్రభాస్ మెచ్చుకున్నారు.

రాజకీయాలు తనకు పెద్దగా తెలియదని కానీ సీఎం జగన్ ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని చెప్పారు. ఎప్పుడైతే ప్రభాస్  ముఖ్యమంత్రి జగన్ పై పాజిటివ్‌గా స్పందించాడో.. అప్పటి నుంచే టీడీపీ శ్రేణులు, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య రగడ మొదలైందని తెలుస్తోంది.

సాహో సినిమాపై టీడీపీ అనుకూల వర్గాల నెగెటివ్ ప్రచారం, దానికి కౌంటర్‌గా ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటర్లు వేయడం లాంటివి జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు సాహో మూవీకి వ్యతిరేకంగా టీడీపీ నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తోందని ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది.

దీనిపై ట్విటర్ వేదికగా లోకేష్ స్పందించారు. ఇంతలా దిగజారి వార్తలు రాయడం సరికాదని సదరు వెబ్‌సైట్‌పై ఆయన మండిపడ్డారు. సాహో మూవీపై  లోకేష్ ఆసక్తికర ట్వీట్లు చేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో మూవీ.. బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

టీడీపీ కార్యకర్తలంతా కూడా సాహో మూవీ చూడాలని పిలుపునిచ్చారు. ఈ ట్వీట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఇడియాటిక్ కథనాలను నమ్మొద్దని  టిడిపి మద్దతుదారులకు, ప్రభాస్ ఫ్యాన్స్‌కి  లోకేష్ విన్నవించారు. ఆగస్టు 30వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ తరుణంలో లోకేష్ ట్వీట్స్ చర్చనీయాంశంగా మారాయి.