కేటీఆర్‌ ట్వీట్‌పై మహేశ్‌ బాబు స్పందన

కేటీఆర్‌ ట్వీట్‌పై మహేశ్‌ బాబు స్పందన

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు స్పందించారు. మహేశ్‌ చిత్రం శ్రీమంతుడు మూవీ స్ఫూర్తితో కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంత్రి కేటీఆర్‌ నిన్న ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కేటీఆర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. అది చూసిన మహేశ్‌ కేటీఆర్‌ ట్వీట్‌కు రీట్వీట్‌ చేస్తూ.. ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ గురించి తెలుసుకున్న ఆయన… శ్రీమంతుడు బృందంతో కలిసి పాఠశాలను సందర్శిస్తానంటూ ట్వీట్ చేశారు. అలాగే బీబీపేట్‌ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన సుభాష్‌ రెడ్డి వంటి వాళ్లు సమాజానికి అవసరమంటూ మహేశ్‌ ప్రశంసలు కురిపించారు.

కాగా శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో ప్రముఖ వ్యాపార వేత్త, రాజకీయ నాయకుడు సుభాష్‌ రెడ్డి తన సొంత ఖర్చులతో కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ప్రభుత్వం పాఠశాలను నిర్మించారు. ఈ స్కూల్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంత గొప్పగా పాఠశాల నిర్మించడం హర్షించదగ్గ విషయమని, సొంత ఊరి రుణం తీర్చుకునే అవకాశం అందరికీ రాదన్నారు. పాఠశాల నిర్మాణం కోసం రూ. 6.5 కోట్లు వెచ్చించిన వ్యాపారవేత్త సుభాశ్‌ రెడ్డిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారి నానమ్మ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను కొత్త హంగులతో నిర్మిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.