కన్నప్పను లాగేసుకున్న విష్ణు

Manchu Vishnu Bhakta Kannappa Movie With Hollywood Team

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కొన్ని దశాబ్దాల క్రితం రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నటించిన ‘భక్త కన్నప్ప’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కృష్ణంరాజు కెరీర్‌లో నిలిచిపోయే చిత్రం అయినా సినిమాను ఇప్పటికి బుల్లి తెరపై ప్రేక్షకులు విపరీతంగా చూస్తూనే ఉన్నారు. ఇక అదే కథా నేపథ్యంతో తనికెళ్ల భరణి చిత్రాన్ని చేయాలని కొన్ని సంవత్సరాలుగా ఆశ పడుతున్నాడు. ఎంతో మంది హీరోలను సంప్రదించిన తనికెళ్ల భరణి చివరకు మంచు విష్ణును ఒప్పించాడు. ఆ మద్య ‘భక్త కన్నప్ప’ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. మంచు విష్ణు హీరోగా, తనికెళ్ల భరణి దర్శకత్వంలో సినిమా అంటూ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను మంచు విష్ణు హైజాక్‌ చేసినట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహాశివుడిపై ఉన్న భక్తితో తనికెళ్ల భరణి ఆ చిత్రాన్ని చాలా కాలంగా చేయాలని కోరుకుంటున్నాడు. అయితే ఏ హీరో కూడా తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఆ సినిమాను చేసేందుకు ముందుకు రాలేదు. తనికెళ్ల భరణి ఆ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకులకు నచ్చే విధంగా పూర్తి చేయలేడు అనేది అందరి అభిప్రాయం. ముందు మంచు విష్ణు భక్తకన్నప్ప చిత్రాన్ని తనికెళ్ల భరణి దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడు. కాని ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాని భరణి దర్శకత్వంలో సినిమాను చేయడం లేదు.

చాలా కాలంగా తనికెళ్ల భరణి వద్ద ఉన్న భక్తకన్నప్ప స్క్రిప్ట్‌ ఇప్పుడు మంచు విష్ణు చేతికి వచ్చింది. త్వరలోనే మంచు విష్ణు ఆ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నాడు. 70 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా మంచు విష్ణు ప్రకటించాడు. హాలీవుడ్‌ దర్శకుడిని ‘భక్త కన్నప్ప’ కోసం మంచు విష్ణు తీసుకు వచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. హాలీవుడ్‌ దర్శకుడు కాకున్నా మరే దర్శకుడి చేతికైనా ‘భక్త కన్నప్ప’ను అప్పగించే అవకాశం ఉంది. తనికెళ్ల భరణి నుండి ఈ ప్రాజెక్ట్‌ను మంచు విష్ణు లాగేసుకున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.