పసికందుని భవనం పైనుంచి విసిరేసిందో కసాయి తల్లి

పసికందుని భవనం పైనుంచి విసిరేసిందో కసాయి తల్లి

పసికందుకు మూడంతస్తుల భవనం పైనుంచి విసిరేసిందో కసాయి తల్లి. భవనం పైనుంచి కిందపడిపోయిన రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ అత్యంత అమానుష ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కుత్బుల్లాపూర్‌కి చెందిన నూతి వేణుగోపాల్‌కి ఫతేనగర్ డివిజన్ నేతాజి నగర్‌కి చెందిన లావణ్యతో 2016లో వివాహమైంది. వారికి ఒక బాబు పుట్టాడు.

కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె మరోసారి గర్భం దాల్చింది. నెలలు నిండిన లావణ్య ప్రసవం కోసం ఇటీవల నేతాజి నగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భర్తతో విభేదాల కారణంగా గత నెల 29న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సనత్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో ఇంటికి చేరింది. అయినా భర్తపై కోపంతో అన్నెం పున్నెం ఎరుగని పసిబిడ్డపై పగ తీర్చుకుంది. పద్నాలుగు రోజుల పసిబిడ్డను తాను ఉంటున్న మూడంతస్తుల భవనం పైనుంచి అమాంతం విసిరేసింది. కిందపడిపోయిన బిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆమె భర్త వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.