చందమామపై ఎన్నో పరిశోధనలు చేసి… అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా నిధులు లేక ఆమధ్య సైలెంట్ అయిపోవడంతో… ఆ పరిశోధనల కంటిన్యూ చేస్తోంది చైనా. ఇదివరకు మనకు కనిపించే చందమామపైకి చేంజ్ 3 ని పంపిన చైనా… ఆ తర్వాత… మనకు కనిపించనివైపు ఉండే చందమామ పైకి యూటు-2 రోవర్‌ని పంపింది. ఆ రోవర్… ఇప్పుడు చందమామను పరిశోధిస్తోంది. మరోవైపు నాసా కూడా చందమామ దగ్గరకు వ్యోమగాముల్ని పంపేందుకు భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఇలాంటి సమయంలో… యూటు-2 రోవర్ పంపిన ఓ ఫొటో ఆసక్తి రేపుతోంది.
2019 నుంచి యుటు-2 రోవర్… చందమామ అవతలి భాగాన్ని పరిశోధిస్తోంది. తాజాగా ఈ రోవర్ నుంచి వచ్చిన ఓ ఫొటోలో విచిత్రమైనది కనిపించింది. చందమామకు అటువైపున… ఓ క్యూబ్ లాంటి ఇల్లు ఆకారం కనిపించింది. చూడ్డానికి అదో సింగిల్ బెడ్ రూంలాగా ఉంది. ఓ తలుపు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. చైనా స్పేస్ ప్రోగ్రామ్‌ని కవర్ చేస్తున్న జర్నలిస్ట్ ఆండ్ర్యూ జోన్స్… శుక్రవారం నుంచి రోవర్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తున్నారు.
మొదటి ట్వీట్‌లో ఆయన… యూటు-2 రోవర్… చంద్రుడిపై తీసిన ఫొటోని షేర్ చేస్తూ… అందులో క్యూబ్ షేప్ లో ఏదో ఉంది అని తెలిపారు. అది వోన్ కార్మాన్ పగులు లోయలో ఉంది. అది రోవర్‌కి 80 మీటర్ల దూరంలో ఉంది. ఆ ట్వీట్‌ని ఇక్కడ చూడండిమరో ట్వీట్‌లో అతను… అతికించినట్లుగా ఉన్న ఓ పెద్ద రాయిని చూపించారు. ఆయన ఉద్దేశం అది మామూలు రాయి కాదు. అలాగని దాన్ని గ్రహాంతరవాసులు సెట్ చేసి ఉంటారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చెయ్యలేదు. ఆ రాయిని ఇదివరకు చేంజ్-3 రోవర్ ఫొటో తీసి పంపింది. ఆ రోవర్‌ని చైనా 8 ఏళ్ల కిందట డిసెంబర్ 1న చందమామపైకి పంపింది.
ఇప్పుడు ఆ క్యూబ్ షేప్‌లో ఉన్నది ఏమిటన్నది తెలుసుకునేందుకు చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఐతే… ఈ మిస్టరీ వీడేందుకు కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే… యూటు-2 రోవర్ ఆ ఇంటి లాంటి నిర్మాణాన్ని చేరేందుకు కొన్ని రోజులు పడుతుంది. ఆ రోవర్ చాలా నెమ్మదిగా కదులుతుంది. దాన్ని కదిలించే పనిని భూమిపై ఉన్న చైనా శాస్త్రవేత్తలు చేపడుతున్నారు. ఆ రోవర్ ఎక్కడా చందమామపై ఉన్న మట్టిలో కూరుకుపోకుండా… జాగ్రత్తగా దాన్ని పంపాల్సి ఉంటుంది. అందుకే కొన్ని రోజులు పడుతుంది.
ఇంతకు ముందు కూడా ఈ రోవర్… ఓ జిగురులా కనిపిస్తున్న పదార్థాన్ని చూపించింది. తీరా దగ్గరకు వెళ్లాక అది ఓ రాయి అని తేల్చింది.ఈ మొత్తం స్టోరీలో ఈ వోన్ కార్మాన్ పగులు లోయ శాస్త్రవేత్తలకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది మామూలు లోయ కాదు. అది చందమామకు అటువైపున దక్షిణ భాగంలో ఉంటుంది. ఎప్పుడో చందమామను ఏదో గ్రహశకలమో, ఉల్క లాంటిదో బలంగా ఢీకొట్టడం వల్ల ఆ పగులు లోయ ఏర్పడింది. అది ఎంత పెద్దదంటే… 180 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది.
చందమామ దక్షిణ భాగంలో… ఇలాంటి లోయలు చాలా ఉన్నాయి. అవి మొత్తం కలిపి 2,500 కిలోమీటర్లు ఉన్నాయి. ఆ మొత్తాన్నీ కలిపి ఎయిట్‌కెన్ బేసిన్ అంటారు. ఆ బేసిన్ మొత్తం 13 కిలోమీటర్ల లోతు ఉంటుంది. అందులోనే చిన్నా, పెద్దా పగులులోయలు ఉన్నాయి. అది దాదాపు చందమామ దక్షిణ భాగమంతా ఉంటుంది. వాటిలో ఒకటైన వోన్ కార్మాన్ పగులు లోయలో… 2019 జనవరి 3న చైనా పంపిన చేంజ్-4 స్పేస్‌క్రాఫ్ట్ దిగింది. దాని నుంచి యూటూ-2 రోవర్ బయటకు వచ్చింది. చందమామకు అటువైపున ల్యాండర్ దిగేందుకు అనుకూలమైనదిగా వోన్ కార్మాన్ పగులు లోయ ఉంది. అందువల్లే చైనా దాన్ని ఎంచుకుంది.