వెంకీ కథే.. నాని కొత్త సినిమా

Nani Next Movie As Venkatesh Movie Story

నాని హీరోగా ప్రస్తుతం శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఒక హీరోగా కనిపించబోతున్న విషయం తెల్సిందే. మల్టీస్టారర్‌ తర్వాత నాని నటించేందుకు రెండు మూడు సినిమాలు సిద్దంగా ఉన్నాయి. ఇటీవలే మళ్లీ రావా చిత్ర దర్శకుడు గౌతమ్‌ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఆ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. నాని తాజాగా మరో సినిమాకు కూడా సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. నాని హీరోగా మారుతి దర్శకత్వంలో ‘సభకు నమస్కారం’ అనే చిత్రాన్ని చేసేందుకు రంగం సిద్దం అయ్యింది. ఈ చిత్రం కథ విషయంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.

గతంలో మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ చిత్రం వచ్చింది. ఆ సినిమా కంటే ముందు వెంకటేష్‌ హీరోగా మారుతి ‘రాధా’ అనే చిత్రాన్ని చేసేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. అయితే ‘రాధా’ కథ తనది అంటూ ఒక రచయిత మీడియాను ఆశ్రయించడంతో పాటు, రచయితల సంఘంలో కూడా ఫిర్యాదు చేశాడు. దాంతో చేసేది లేక ఆ సినిమాను క్యాన్సిల్‌ చేశారు. తాజాగా నాని హీరోగా అదే కథతో చిత్రాన్ని చేసేందుకు మారుతి ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం చైతూతో ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాన్ని చేస్తున్న దర్శకుడు త్వరలోనే నానితో ‘సభకు నమస్కారం’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. ఒక ఎమ్మెల్యే ప్రేమలో పడటంతో పాటు, తన చుట్టు ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాడు అనే విషయాన్ని మారుతి చూపించబోతున్నాడు.