భారత్ లో ప్రవేశించిన ‘ఈటా వేరియంట్’

భారత్ లో ప్రవేశించిన 'ఈటా వేరియంట్'

తొలిసారి 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి.. రోజుకో కొత్త రూపం దాల్చుతోంది. జన్యుమార్పిడి చెందుతూ వివిధ వేరియంట్‌లుగా పంజా విసురుతోంది. భారత్‌లో తొలిసారి గుర్తించిన డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 135 దేశాలకు విస్తరించింది. ఇదిలా ఉండగా, బ్రిటన్లో తొలిసారి గుర్తించిన ‘ఈటా వేరియంట్’ భారత్లో ప్రవేశించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

కర్ణాటకలోని మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకం వేరియంట్ గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. తొలిసారి బ్రిటన్లో వెలుగు చూసిన ఈటా వేరియంట్ను మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి నమూనాల్లో ఉన్నట్టు జన్యు పరీక్షల్లో తేలిందని పేర్కొన్నారు. నాలుగు నెలల కిందట బాధితుడు దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు వివరించారు. కరోనా లక్షణాలు బయటపడటంతో నిర్ధారణ పరీక్షలో కోవిడ్ పాజిటివ్‌గా వచ్చిందని వివరించారు.

చికిత్స అనంతరం అతడు కరోనా నుంచి కొద్ది రోజుల తర్వాత కోలుకున్నట్లు చెప్పారు. అతడితో సన్నిహితంగా ఉన్న 100 మందికిపైగా గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జన్యు విశ్లేషణ పరిశోధనలో భాగంగా అతడి రక్త నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపామని, ఆ వ్యక్తిలో కొత్త రకం ఈటా వేరియంట్ బయటపడినట్లు చెప్పారు.

కాగా, డెల్టా వేరియంట్ రూపంలో దేశంలో కరోనా వైరస్ ముప్పు కొనసాగుతూనే ఉంది. చిన్నారుల్లో కూడా ఈ వేరియంటే ప్రధానంగా కనిపిస్తోంది. రెండో దశ వ్యాప్తి వేళ కర్ణాటకలో నిర్వహించిన జన్యువిశ్లేషణల ఆధారంగా నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ సోకిన పిల్లల్లో విలక్షణమైన వేరియంట్ ఏదీ లేదు.. డెల్టానే ప్రధానంగా కనిపిస్తోంది’ అని ప్రొఫెసర్ రవి మీడియాకు వెల్లడించారు.

కర్ణాటకలో చిన్నారుల నుంచి సేకరించిన నమూనాల్లోని వైరస్‌ జన్యు విశ్లేషణపై ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు.కర్ణాటకలో 77 శాతం ఇన్ఫెక్షన్లకు డెల్టా వేరియంటే కారణమని తేలింది. మొత్తం 1,413 కేసులకు గానూ 1,089 కేసుల్లో డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు వెల్లడైంది. అలాగే 159 కప్పా, 155 ఆల్ఫా, ఏడు బీటా, మూడు డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి.