నేరస్థుల పనిపడుతున్న పాపియోన్

New Fingerprint Technology

హత్య అయి నా.. దొంగతనమైనా.. మరే నేరమైనా క్రైం సీన్‌లో లభించే వేలిముద్రలే నేరపరిశోధనలో అత్యంత కీలకం. చాలా కేసుల్లో వీటి ఆధారంగానే నేరస్థులను గుర్తిస్తుంటారు. ఆ నేరాలను కోర్టులో నిరూపించే పోలీసులకు ఇవి శాస్త్రీయ ఆధారాలుగా ఉపకరిస్తాయి. నేర పరిశోధనలో ఎంతో కీలకమైన వేలిముద్రల విశ్లేషణ కోసం తెలంగాణ పోలీసులు దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక పాపియోన్ (ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం)ను వాడుతున్నారు. ఎఫ్‌బీఐ (అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ) లాంటి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు ఉపయోగిస్తున్న ఈ పాపియోన్ ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీని గతేడాది మే నెలలో అం దుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ పోలీసులు.. ఈ రెండేండ్లలో వందల కేసులను పరిష్కరించారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి పాత కేసులను ఛేదించడం, నేరస్థులను ముందుగానే గుర్తించడం, మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్‌లతో రియల్‌టైంలోనే అనుమానితులను గుర్తించడంలో తెలంగాణ సీఐడీ ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఎంతో ముందున్నది.

క్యాట్ టూల్‌తో సత్ఫలితాలు

తెలంగాణలో వినియోగిస్తున్న పాపియోన్ ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీకి ఇటీవల క్యాట్ (క్రిమినల్ అప్రిహెన్షన్ టూల్)ను జత చేశారు. ఈ టూల్ అద్భుత ఫలితాలను ఇస్తున్నదని, దీని ద్వారా 30 మంది వాంటెడ్ నేరగాళ్లను గుర్తించామని అధికారులు తెలిపారు. పోలీసుల సర్వర్‌లో పాత నేరస్థులు, ఓవీ (ఔట్‌ఆఫ్ వ్యూ)లు, వాంటెడ్ నేరగాళ్ల వేలిముద్రలు, ఫొటోలు ఉంటాయి. ప్రస్తుతం ఫింగర్‌ప్రింట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ, ఏపీ ఇచ్చిపుచ్చుకుంటుండటంతో ఒక రాష్ట్రంలో పట్టుబడిన నేరస్థుడిపై మరో రాష్ట్రం లో కేసు ఉంటే ఆ వివరాలు హైదరాబాద్‌లోని ఫింగర్‌ప్రింట్ బ్యూరో సర్వర్‌లో తెలిసిపోతుంది. ఫింగర్‌ప్రింట్ బ్యూరో అధికారులు స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తుండటంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.

సిబ్బంది కొరతతో అదనపు భారం

ఫింగర్‌ప్రింట్స్ విశ్లేషణలో తెలంగాణ పోలీసులకు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా క్షేత్రస్థాయిలో సరిపడినంత సిబ్బంది లేకపోవడంతో అదనపు భారం పడుతున్నది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఫింగర్‌ప్రింట్ బ్యూరోలో సిబ్బంది సంఖ్య సగానికి పడిపోయింది. డైరెక్టర్ పోస్టు కూడా ఏపీకి వెళ్లడంతో ఇంచార్జి డైరెక్టరే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం 68 పోస్టులకు (ఒక డీఎస్పీ, 13 మంది ఇన్‌స్పెక్టర్లు, 21 మంది ఎస్సైలు, 33 మంది ఏఎస్సైలు) 30 మంది (ఒక డీఎస్పీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, 21 మంది ఎస్సైలు, ఐదుగురు ఏఎస్సైలు) మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇంకా 38 పోస్టులు భర్తీచేయాల్సి ఉన్నది. తెలంగాణలో కొత్త జిల్లాలు, కమిషనరేట్ల ఏర్పాటుతో సిబ్బంది అవసరం మరింత పెరిగింది. అన్ని జిల్లాల్లో సరిపడా సిబ్బంది ఉండాలంటే నలుగురు డీఎస్పీలు, 30 మంది ఇన్‌స్పెక్టర్లు, 108 మంది ఎస్సైలు కలిపి మొత్తం 142 పోస్టులు మంజూరు చేయాలని పోలీస్‌శాఖ కోరింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

పాపియోన్‌తో వేగంగా కేసుల ఛేదన

తెలంగాణ పోలీసులు పాపియోన్ టెక్నాలజీని తెచ్చిన తర్వాత ఎన్నో అపరిష్కృత కేసుల చిక్కుముడులు వీడాయి. 12,413 పాత కేసుల్లో పాపియోన్ టెక్నాలజీని వినియోగించి 641 కేసులను పరిష్కరించారు. ఈ టెక్నాలజీ కోసం రూ.20 కోట్లు ఖర్చుచేసిన తెలంగాణ పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా పరిష్కారమైన ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో దొంగల నుంచి మొత్తం రూ.18.51 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ పోలీసులు ఈ టెక్నాలజీ ద్వారా ఏపీ, కర్ణాటకకు చెందిన 448 కేసుల్లో 19 కేసులను ఛేదించడంతోపాటు డాటాబేస్‌లోని వేలిముద్రల ఆధారంగా 68 అనాథ శవాల వివరాలను కనిపెట్టగా.. మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్‌ల ద్వారా పెట్రోలింగ్ బృందాలు పాత నేరచరిత్ర ఆధారంగా 9,450 మంది అనుమానితులను గుర్తించారు. పాస్‌పోర్టుల వెరిఫికేషన్‌కు వెళ్లే ఎస్బీ సిబ్బందికి మొబైల్ సెక్యూరిటీ డివైజ్‌లు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ఇప్పటివరకు 23 మంది తమ నేరచరిత్రను దాచిపెట్టి పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసినట్టు గుర్తించడంతో వారి పాస్‌పోర్టులను రద్దుచేశారు. 3,595 మంది రోహింగ్యాల వేలిముద్రలను సేకరించి డాటాబేస్‌లో అప్‌లోడ్ చేశారు.