కేరళలో నోరో వైరస్‌ కేసులు

కేరళలో నోరో వైరస్‌ కేసులు

కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని ఊపిరి పీల్చుకుంటున్న కేరళలో నోరో వైరస్‌ కేసులు బయటపడటం ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ రాష్ట్రంలో నోరో వైరస్ కేసులు పెరుగుతుండడంతో పొరుగున ఉన్న కర్ణాటక అప్రమత్తమైంది. ప్రత్యేకంగా సరిహద్దు జిల్లాలు దక్షిణ కన్నడ, కొడుగు, ఉడుపి, ఉత్తరకన్నడలో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎటువంటి అలసత్వం వద్దని, అనుమానిత లక్షణాలుంటే వైద్య పరీక్షలు చేయించాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

నోరో వైరస్‌తో బాధపడుతున్న వారిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం లక్షణాలు ఉంటున్నాయని అధికారులు పేర్కొన్నారు. నీరు, ఆహారం ద్వారానే ఈ వైరస్‌ వ్యాపిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. మరోవైపు, కోవిడ్-19 అనంతరం హఠాన్మరణాల సంఖ్య పెరిగిపోతున్న వైనం కూడా ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచే స్తోంది. ఏమాత్రం ముందస్తు లక్షణాలు లేకుండానే బ్రెయిన్‌ హెమరేజ్‌, కార్డియాక్‌ అరెస్ట్‌ వంటి తీవ్ర సమస్యలకు గురవుతున్నవారు అధికమవుతున్నారని తెలిపింది.

కొవిడ్‌ అనంతర ఆరోగ్య పరిస్థితులతో వీటికి సంబంధం ఉందా? అనే అంశంపై వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. 2020 నుంచి కర్ణాటకలో హఠాన్మరణాల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌ అవధి కూడా అదే కావడం గమనార్హం. గతేడాది 49,925మంది హఠాన్మరణాలకు గురయ్యారని ఇందులో 28,680మంది గుండెపోటుతోనే మృతి చెందారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

45-55ఏళ్లలోపువారిలోనూ, 18 ఏళ్లలోపు వారిలోనూ ఈ సమస్యలు ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. దీనిపై లోతుగా పరిశీలన జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని నిపుణులకు సూచించినట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ అన్నారు. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలతో మళ్లీ డెంగీ కేసులు పెరుగుతున్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు 15 వరకు సుమారు 3 వేలమందికి డెంగీ సోకింది. అక్టోబరు, నవంబరు నెలల్లో 2,516 మందిలో డెంగీ లక్షణాలు కనిపించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న అన్ని జిల్లాల ఆరోగ్యశాఖ విభాగాలను అప్రమత్తం చేసినట్టు అధికారులు వెల్లడించారు.