మొబైల్ వినియోగదారులకి శుభవార్త….ఇక ఆధార్ అక్కర్లేదు !

Not linked your mobile SIM card to Aadhaar

మొబైల్ వినియోగదారులకు శుభవార్త. ఇప్పటి వరకు కొత్త సిమ్ కావాలన్నా, వాడుతున్న సిమ్ మార్చాలన్నా.. ఇలా ప్రతి దానికి ఆధార్‌తో ముడిపెట్టిన మొబైల్ సంస్థలు ఇక ఆ విధానానికి స్వస్తి చెప్పనున్నాయి. ఈ మేరకు కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మొబైల్ నెంబర్ కావాలంటే ఆయా కంపెనీలు 29 కాలమ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో ఇప్పటి వరకు ‘ఆధార్’ కాలం కూడా ఉంది.. ఇక నుంచి ఆ కాలమ్ ఉండదని కేంద్ర టెలికామ్ శాఖ స్పష్టం చేసింది. వినియోగదారుల నుంచి గుర్తింపు కోసం ఆధార్ నంబర్‌కు బదులు వర్చువల్ ఐడీలు తీసుకోవాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తాజా ఆదేశాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారులు గుర్తింపు కోసం ఆధార్ నంబర్‌కు బదులు వర్చువల్ ఐడీలను ఉపయోగించేలా సిస్టమ్‌లు, నెట్‌వర్క్‌లను సవరించుకోవాలంటూ సూచించింది. మొబైల్ వినియోగదారుల కోసం ‘లిమిటెడ్ కేవైసీ’ వినియోగించే దిశగా తమ సాఫ్ట్వేర్ లను మార్చుకోవాలని పేర్కొంది. ఈ విధానం జులై 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఆధార్ కార్డులకు సంబంధించిన ఎలాంటి ఆర్ధిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి వీలు లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం పేర్కొంది.

విర్చువల్ ఐడీ కోసం ఇలా చేయండి :
*వినియోగదారులుమొదట https://resident.uidai.gov.in/web/resident/vidgeneration కి వెళ్ళాలి.
* తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్‌లను పూర్తిచేయాలి. వెంటనే మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది.
* ఆ తర్వాత అదే పేజీలో ‘OTP’ని ఎంటర్ చేసి జనరేట్ ‘VID’ అనే బటన్‌ను క్లిక్ చేసి.. ఎంటర్ బటన్ నొక్కాలి.
* వెంటనే యూజర్ మొబైల్ నంబరుకు విర్చువల్ ఐడీ వస్తుంది .
* ఈ వర్చువల్ ఐడీలతో జులై 1 నుంచి సిం కార్డులు పొందవచ్చు.
* ఒక వేళ విర్చువల్ ఐడీని మర్చిపోయినా మళ్లీ పొందే అవకాశముంటుంది.