హీరో కారు గుద్ది మహిళ మృతి…హీరోకి గాయాలు

టాలీవుడ్ యువ హీరో, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్ తో ఎంట్రీ ఇచ్చి తాజాగా ‘నువ్వు తోపురా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో సుధాకర్ కోమకుల కారు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైంది. ప్రమాదంలో నటుడు సుధాకర్‌ కూడా గాయపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై శనివారం (ఏప్రిల్ 27) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్‌ కారు అదుపుతప్పి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా కారులో ఉన్న నటుడు సుధాకర్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డట్టు సమాచారం. యువ కథానాయకుడు సుధాకర్‌ శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తాజాగా ‘నువ్వు తోపురా’ సినిమాలో హీరోగా నటించారు. మే 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నువ్వు తోపురా సినిమా ప్రచారంలో భాగంగా సుధాకర్ హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.