జగన్ ని చీకట్లో ఉంచుతున్న ప్రశాంత్…పవన్ కి పవర్ లేదట.

Prashanth Kishore Secret Survey on Pawan Janasena

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2014 ఎన్నికల ముందు వైసీపీ గెలుపు లాంఛనమే అని నమ్మారు జగన్. అందుకు తగ్గట్టే ప్రవర్తించారు కూడా. ఎన్నికల తర్వాత రాజకీయాలు, జనం మనోభావాలు పైకి కనిపించినంత సులభంగా అర్ధం కావని అర్ధం అయి ఉండాలి. ఎన్నికల ఫలితాలు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రభావం పనిచేసిందని జగన్ కి ఓ అభిప్రాయం ఏర్పడింది. అందుకే కాపు ఓటు బ్యాంకు కోసం ఈ మూడు నాలుగేళ్లలో జగన్ గట్టి ప్రయత్నాలే చేశారు. అందులో కాపు రిజర్వేషన్ ల కోసం ముద్రగడ ఆధ్వర్యంలో సాగిన పోరాటం కూడా ఒకటి. ఆ ప్రయత్నం కూడా విఫలం కావడం, జనసేన నేరుగా వచ్చే ఎన్నికల్లో తలపడడం చూసి పవన్ ఇంపాక్ట్ గురించి తెలుసుకోమని ప్రశాంత్ కిషోర్ టీం కి పురమాయించాడట జగన్ .

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ప్రభావం ఎలా ఉండబోతోందో అన్న టాపిక్ మీద ప్రశాంత్ కిషోర్ టీం చేసిన సర్వే లో ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయట. జనసేన గురించి మీడియాలో వస్తున్న వార్తల స్థాయిలో క్షేత్ర స్థాయిలో ప్రభావం లేదంట. మారుమూల పల్లెల్లో అసలు జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న విషయమే తెలియదంట. పవన్ స్వయంగా పోటీ చేసినా రాయలసీమ జిల్లాల్లో గెలిచే పరిస్థితి లేదంట. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ మాత్రం ఉండదు అని చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ బృందం ఇలాంటి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో అంశాలు చూస్తే వీళ్ళు నిజంగా సర్వే చేశారా అనిపిస్తోంది.

మొబైల్ ఫోన్స్ వాడకం విస్తృతం అయ్యాక కూడా పవన్ పార్టీ గురించి ఇంకా పల్లెల్లో తెలియదు అని చెప్పడం ఆశ్చర్యం అనిపిస్తోంది. నిజంగా పవన్ సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా కాపులు ప్రభావశీలంగా వున్న కొన్ని కోస్తా జిల్లాల్లో అయినా సానుకూల ఫలితాలు రాబట్టుకోలేరా అనిపిస్తోంది. కిందటి ఎన్నికలతో పోలిస్తే పవన్ ప్రభావం కాస్త తగ్గి ఉండొచ్చేమో గానీ అసలు లేదనడం మాత్రం జగన్ ని చీకట్లో ఉంచడమే అవుతుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనుకునే రాజకీయాల్లో 2014 ఫలితం చూసాక కూడా పవన్ ని తక్కువ అంచనా వేయడం అంటే కళ్ళు మూసుకుని ప్రయాణం చేసినట్టే.