యువ‌తీ యువ‌కుల‌కు ప్రేమించే హ‌క్కు  ఉందిః ప్ర‌వీణ్ తొగాడియా

praveen togadia says youth has right to love
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ప్రేమికుల రోజు అన‌గానే ప్రేమ సందేశాలు ఇచ్చిపుచ్చుకునే యువ‌తీ యువ‌కుల‌తో పాటు గుర్తువ‌చ్చే మ‌రికొంద‌రు వీహెచ్ పీ, భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌లు. కొన్నేళ్లుగా  వాలైంటైన్స్ డే కు వ్య‌తిరేకంగా వాళ్లు చేస్తున్న ఆందోళ‌న అంతా ఇంతా కాదు. ప్రేమికుల రోజును దేశంలో నిషేధించాల‌న్న‌ది వారి ప్రధాన‌మైన డిమాండ్. ఈ మోర‌ల్ పోలీసింగ్ పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ ఏటా  ఫిబ్ర‌వరి 14కు రెండు రోజుల ముందు వీహెచ్ పీ నేత‌లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మ‌రీ ప్రేమికుల‌రోజుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేయాల‌ని పిలుపునిస్తారు.
కానీ ఈ ఏడాది మాత్రం వీహెచ్ పీ త‌న వైఖ‌రి మార్చుకుంది.  చంఢీగ‌ఢ్ లో వీహెచ్ పీ, భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి వీహెచ్ పీ అంత‌ర్జాతీయ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు ప్ర‌వీణ్ తొగాడియా మాట్లాడారు.  ఈ సంద‌ర్భంగా  ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి.  వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా యువ‌తకు ఇచ్చిన సందేశంలో తొగాడియా వీహెచ్ పీ వైఖ‌రికి పూర్తిభిన్న‌మైన అభిప్రాయం వ్య‌క్తంచేశారు. యువ‌తీయువ‌కుల‌కు ప్రేమించే హ‌క్కు ఉంద‌ని, ప్రేమికుల రోజున ఎలాంటి ఆందోళ‌న‌లు, హింసా ఉండ‌కూడ‌ద‌ని ఆయ‌న కోరారు. జంట‌లు ప్రేమ‌లో ప‌డ‌కుంటే, పెళ్లిళ్లు జ‌ర‌గ‌వ‌ని, అలా పెళ్లిళ్లు లేకుండా ప్ర‌పంచం పురోగ‌తి సాధించ‌ద‌ని, అందువ‌ల్ల‌ ప్రేమించే హ‌క్కును యువ‌తీ యువ‌కులు పొందాల‌ని తొగాడియా సందేశాన్నిచ్చారు. ఫిబ్ర‌వ‌రి 14న త‌మ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేప‌ట్ట‌కుండా ఆదేశాలిచ్చామని తెలిపారు. త‌మ కుమార్తెలు,  సోద‌రీమ‌ణుల‌కు కూడా ప్రేమించే హ‌క్కుంద‌ని తెలిపామ‌న్నారు.