ఆర్ఆర్ఆర్ మీద రాజమౌళి ప్రెస్ మీట్…ఫుల్ కవరేజ్ !

Rajamouli RRR Movie Updates

దర్శకధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ RRR పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బాహుబలి చిత్రం తరువాత దర్శకధీరుడు టాలీవుడ్ అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఈ సినిమాను భారీ హంగులతో రూపొందిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా చకా చకా షూటింగ్ జరుపుకుపోతున్నారే తప్ప చిత్రానికి సంబంధించిన విషయాలను సీక్రెట్‌గానే ఉంచారు. ఈ చిత్ర కథ, పాత్రలు, హీరోయిన్స్ తదితర అంశాలపై పూర్తి వివరాలను తెలియజేయడానికి ఈరోజు RRR టీం మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు హాజరయ్యారు. 1897 లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. చదువుకోవడంతో పాటు ఆయన అన్ని విషయాల్లో చురుకుగా ఉండేవారు. యుక్త వయసులో ఉండగా ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రెండు సంవత్సరాల పాటు ఎక్కడున్నారో తెలీదు. ఇంటికి తిరిగొచ్చాక స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తరువాత బ్రిటీష్ వాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. అలానే 1901 లో తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో ఇంటి నుండి వెళ్లిపోయారు. అలా వెళ్లిన తరువాత ఆయన ఏం చేశారనేది ఎవరికీ తెలియదు. తరువాత తిరిగొచ్చి గిరిజనుల స్వాతంత్ర్యం కోసం పోరాడారు. గెరిల్లా పోరాటంలో పాల్గొన్నారు. ఆయన కూడా బ్రిటీషర్ల చేతులో చనిపోయారు. ఇద్దరూ ఒకే కాలంలో పుట్టడం, ఇంటి నుండి వెళ్లిపోవడం, తిరిగొచ్చి ఒకేవిధంగా పోరాడి అమరులు కావడం అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. నా కథ ఈ క్యారెక్టర్లకు దగ్గరగా ఉండబోతుందని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఇద్దరు వీరులు, ఒకరితో ఒకరు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు, ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అయి ఉంటే వాళ్ల మధ్య స్నేహం ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనేది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. నా సినిమా కంప్లీట్‌ గా ఫిక్షనల్‌ గా ఉంటుంది. భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. 1920 లో జరిగే కథ కాబట్టి చాలా పరిశోధన చేశాం. ఆనాటి జీవన విధానం, మనుషుల వ్యక్తిత్వం గురించి చాలా రీసెర్చ్ చేశాం. అందుకే షూటింగ్ స్టార్ట్ చేయడం లేట్ అయింది’ ‘ఇలాంటి పెద్ద హీరోలు ఉన్న సినిమాకి సపోర్టింగ్ కాస్ట్ కూడా ఉండాలి. అజయ్ దేవగన్ గారు సినిమాలో కీలకపాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ఆయన నటిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. తారక్ సరసన డేజీ అడ్గారియన్స్ నటిస్తోంది. ‘RRR’ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. అయితే ఇదే టైటిల్‌గా బావుందని అంటున్నారు. అన్ని భాషల్లో ఇది కామన్‌గా ఉంటుంది. కానీ ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ ఉంటుంది. నా సినిమాలో యంగ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్, యంగ్ కొమరం భీంగా తారక్ కనిపించబోతున్నారు” అని చెప్పారు రాజమౌళి.