రాయపాటి అలిగి మరీ సాధించుకున్నారు !

chandrababu And rayapati

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ అధిష్ఠానంపై అలకబూనారు. తనకు టిక్కెట్ కేటాయింపుపై ఎటూ తేల్చకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారు. నరసరావుపేట ఎంపీ టిక్కెట్‌‌ నిర్ణయం పెండింగ్‌లో పెట్టడం, ఆ టిక్కెట్‌ను భాష్యం రామకృష్ణకు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో రాయపాటి వర్గం ఆందోళన చెందుతోంది. తనకు నరసరావుపేట ఎంపీ టిక్కెట్, తన కుమారుడికి సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వాలంటూ రాయపాటి అధిష్ఠానాన్ని కోరుతున్నారు. అయితే సత్తెనపల్లి టిక్కెట్ తనకే కేటాయించారని, 22న నామినేషన్ వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీపై కూడా స్పష్టత లేకపోవడంతో రాయపాటి మదనపడుతున్నారు. దీంతో రాయపాటి సోదరులు టీడీపీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు తనకు అన్యాయం చేయరని సాంబశివరావు పైకి గంభీరంగా చెబుతున్నా లోలోపల ఆందోళన చెందుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. టీడీపీ పెద్దల వైఖరితో మనస్తాపం చెందిన రాయపాటి వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరందుకుంది. పలువురు వైసీపీ నేతలు సైతం ఆయనకు ఫోన్లు చేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. వైసీపీ నేతలు తమ కుటుంబ సభ్యులతో ఫోన్ల ద్వారా చర్చలు జరుపుతున్నారని రాయపాటి బాంబు పేల్చారు. నరసరావుపేట టికెట్ విషయంలో ఈరోజు సాయంత్రంలోగా టీడీపీ అధిష్ఠానం చర్యలు తీసుకోకుంటే తన కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. దీంతో చివరికి ఎంపీ రాయపాటి సాంబశివరావుకి అధిష్ఠానం తీపి కబురు అందించింది. నరసరావుపేట ఎంపీ స్థానానికి ఆయన పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ అధిష్ఠానం రాయపాటికి తెలియజేసినట్టు సమాచారం. నారా లోకేశ్ ఆయనకు ఫోన్ చేసి తొందరపడవద్దని ఆయనకు ఎంపీ స్థానం కేటాయించినట్టు తీపి కబురును అందించారు. అయితే నరసరావుపేట అసెంబ్లీకి స్థానిక డాక్టర్ అరవింద బాబు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఆయన పేరు ఖరారు చేయడం పట్ల స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పున:పరిశీలించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.