Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ మతానికి చెందిన పండుగైనా దాని వెనుక ఒక అర్ధమో సందేశమో దాగి వుంటుంది. మానవాళి సంతోషంగా ఉండాలి అలాగే సంతోషంగా ఉన్న సందర్భాన్ని ఎలా వేడుక చేసుకోవాలి అనుకున్నప్పుడు పెద్దలు ప్రవేశ పెట్టిందే ఈ పండుగ సంస్కృతి. రంజాన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇస్లామీ కేలండర్లో 9వ మాసం ‘రంజాన్’. ఈ మాసంలోనే ‘దివ్య ఖురాన్’ అవిర్భవించిందని వారి నమ్మకం. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం’. ఈ పవిత్ర మాసంలో భక్తితో ఉపవాసం చేసిన వారి అన్ని తప్పులూ మన్నించబడతాయనీ, వీరంతా ‘రయ్యాన్’ అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చేస్తారనీ ఖురాన్ చెబుతోంది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ‘ ఉపవాసవ్రతం’ . దీనిని పార్సీలో ‘ రోజా ‘ అనీ, అరబ్బీ భాషలో సౌమ్ అంటారు. ఈ నెలఅంతా తెల్లవారుజామున భోజనం(సహర్) చేసి, రోజంతా ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి భోజనం (ఇఫ్తార్ ) చేస్తారు.
ఉపవాసదీక్ష చేసేవారు అబద్ధం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా దైవచింతనతో గడుపుతూ వుంటారు. స్త్రీ పురుషులందరికీ విధిగా నిర్ణయించబడిన ఉపవాస దీక్ష విషయంలో వృద్దులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో వున్నవారికి మినహాయింపు ఉంది. రంజాన్ నెలలో ఉపవాసానికి ఎంత ప్రాధాన్యం ఉందో దానానికీ అంటే విలువ ఉంది. సంపన్నులు, సంపాదనాపరులంతా ఈ మాసంలో జకాత్ ‘ అచరించాలని ఖురాన్ చెబుతోంది. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి రెండున్నర శాతం చొప్పున ధన, వస్తు రూపంలో నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా సంతోషంగా పండుగ జరుపుకొనేలా చూడటమే ‘ జకాత్ ప్రధాన ఉద్దేశ్యం. జకాత్’ తో పాటు ‘ ఫిత్రా’ దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత వుంది. తిండి, బట్టకు నోచుకోని అభాగ్యులకు 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ , దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెడతారు.