రిజర్వ్‌ బ్యాంక్‌ కమిటీ కీలక నిర్ణయాలు

రిజర్వ్‌ బ్యాంక్‌ కమిటీ కీలక నిర్ణయాలు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆరుగురు సభ్యుల కమిటీ సమావేశానికి ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వం వహిస్తున్నారు. కమిటీ కీలక నిర్ణయాలు బుధవారం వెలువడతాయి. అయితే రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూ, బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో  యథాతథ పరిస్థితికే ఆర్‌బీఐ మొగ్గు చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి.

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ పర్యవసానాలు ఈ అంచనాలకు తాజా కారణం. యథాతథ రెపో రేటు విధానం కొనసాగిస్తే, ఈ తరహా నిర్ణయం వరుసగా ఇది తొమ్మిదవసారి అవుతుంది. 2019లో రెపో రేటును ఆర్‌బీఐ 135 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది . 2020 మార్చి తర్వాత 115 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. పార్లమెంటులో ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశపెడుతుండడం తాజా సమావేశాల మరో కీలక నేపథ్యం కావడం గమనార్హం.

రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతం ఉంటుందన్నది ఆర్‌బీఐ అంచనా. ఇదే జరిగితే సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్‌ పునరుద్ధరణకు దోహదపడుతుంది. ఇక రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్‌బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్‌బీఐ అంచనావేసింది. 2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో ఆర్‌బీఐ అంచనాలను (7.9 శాతం) మించి 8.4 శాతం వృద్ధిని ఎకానమీ నమోదుచేసుకుంది. వెరసి 2021–22 తొలి ఆరు నెలల్లో 13.7 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది.