రిలయన్స్ ముందడుగు: కరోనాకు రిలయన్స్ ఔషధ తయారీ…

ప్రపంచమంతా అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి- కోవిడ్-19 నివారణకు ఎలాంటి మందు లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దీంతో జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నివారణ ఔషధ తయారీలో తలమునకలై ఉన్నారు. ఇందులో భాగంగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైంటిస్టుల పరిశోధనపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కరోనా వ్యాప్తిని సముద్రంలో దొరికే ఓ రకమైన ఎరుపు రంగు నాచు (మెరైన్ రెడ్ ఆల్గే) తో కరోనాకి చెక్ పెట్టవచ్చని ఆ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీని నుంచి తయారుచేసిన జీవరసాయన పొడి యాంటీ-వైరల్ ఏజెంట్ గా పని చేస్తుందని తెలిపారు.

అంతేకాకుండా వృక్షజాలం, జంతుజాలం, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఎత్తైన మొక్కలు వంటి సహజ వనరుల నుంచి ఉత్పన్నమైన ఉత్పత్తులు వైరస్ ల వల్ల వచ్చే వ్యాధులతో పోరాడటానికి గొప్ప సమర్ధవంతంగా పని చేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా.. పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాచురైడ్‌లు, కరోనా వైరస్ ను అరికట్టేందుకు పనిచేస్తాయని రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు వినోద్ నాగ్లే, మహాదేవ్ గైక్వాడ్, యోగేశ్ పవార్, సంతను దాస్‌గుప్తా బృందం వెల్లడించింది.

అంతేకాకుండా తాజాగా వారి పరిశోధనల ప్రకారం.. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కారణమయ్యే కరోనా వంటి వ్యాథులకు చెందిన వైరస్‌లను అడ్డుకుంటాయని తమ పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు అన్నారు. బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా ఇవి పనిచేస్తాయని వివరించారు. ఇంకా కరోనా యాంటీ వైరల్ మందులు మాత్రమే కాకుండా శానిటరైజ్ వస్తువులపై వైరస్ చేరకుండా కోటింగ్ కూడా వాడవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్ ను నియంత్రించడంలో పోర్ఫిరీడియంతో పాటు వివిధ జీవ వనరులనుంచి లభ్యమయ్యే క్యారేజీనన్ పాత్ర ప్రశంసనీయమైందని వివరించారు. కాగా తమ పరిశోధనకు సపోర్ట్ గా ఇప్పటికే.. క్లినికల్ ట్రయల్ అధ్యయనాలలో క్యారేజీనన్, సల్ఫేట్ పాలిసాకరైడ్ పాటు పోర్ఫిరిడియం ఇపిఎస్‌ను కూడా వినియోగించవచ్చని తెలిపారు. అలాగే.. ఈ నాచు నుంచి ఉత్పత్తి అయ్యే ఎక్సోపోలిసాచురైడ్లలోని బహుళ అణువులతో (మాలిక్యులస్) చికిత్స సానుకూల ప్రయోజనం కనిపిస్తుందని పేర్కొన్నారు. అయితే సహజమైన పాలీశాచురేడ్స్ పుష్కలంగా ఉన్న సీవీడ్స్ (సముద్ర నాచు)కు ఆహార ఉత్పత్తులు, సౌందర్య సాధనాలతోపాటు పలు ఔషధ పరిశ్రమల మార్కెట్ లో భారీ డిమాండ్ ఉన్న విషయం విదితమే.