తెలుగు చిత్ర సీమ గురించి దిగులు చెందుతున్న మెగాస్టార్

తెలుగు చిత్ర సీమ గురించి దిగులు చెందుతున్న మెగాస్టార్

కరోనా వైరస్ అన్ని రంగాలను తీవ్రంగా దెబ్బతీసింది. లాక్ డౌన్ తో సర్వం మూతపడింది. అన్ని రికవరీ కావాల్సి ఉంది. అది ఎప్పుడనేది చెప్పడం కష్టం. అయితే అన్నింటికంటే ఎక్కువ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై పడింది. షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా థియేటర్స్ మల్టీప్లెక్స్ బంద్ అయిపోయాయి. దీంతో వందల కోట్ల నష్టం. కరోనా తగ్గినా జనాలు సామూహికంగా థియేటర్స్ కు వచ్చి సినిమాలు చూస్తారన్న గ్యారెంటీ లేదు. దీంతో సినిమా పరిశ్రమలో తీవ్ర ఆందోళన నెలకొంది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీ భవిష్యత్ పై ఇదే ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే లాక్ డౌన్ తో రోడ్డున పడ్డ సినీ కార్మికులను ‘కరోనా క్రైసిస్ చారిటీ’ ఏర్పాటు చేసి విరాళాలు కలెక్ట్ చేసి ఆదుకున్నామన్నారు. సినీ పరిశ్రమ కార్యకలాపాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో రోజువారీ కార్మికులు కష్టాల్లో పడ్డారని చిరంజీవి అన్నారు. వారిని ఆదుకునే విషయంపై ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి విరాళాలు సేకరించి అందించామన్నారు. లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమలోని పెద్దలు నిర్మాతలు ఫైనాన్షియర్స్ ఇతరులందరం కలిసి మాట్లాడుకుంటామన్నారు. ఫైనాన్షియర్స్ వడ్డీ రేట్లను తగ్గించి నిర్మాతలను ఆదుకోవాలని.. లేకపోతే సినీ పరిశ్రమ మనుగడ కష్టమన్నారు.

సినీ పరిశ్రమను కరోనా వైరస్ ఎంతగా వెంటాడుతున్నదంటే మాటల్లో కూడా చెప్పలేమని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత నష్టం వాటిల్లుతుందనేది నిర్ధారణకు రాలేమన్నారు. వందల కోట్ల నష్టం ఉంటుందని మాత్రం చెప్పగలను అని అన్నారు. కరోనా కారణంగా ఎప్పుడు థియేటర్లు తెరుస్తారు? షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డారు. తొందరగా సినీ పరిశ్రమ కొలుకొని నిలబడాలని చిరంజీవి ఆకాంక్షించారు.