సుశాంత్‌తో దిగిన ఫోటోలను షేర్‌ చేసిన రియా

సుశాంత్‌తో దిగిన ఫోటోలను షేర్‌ చేసిన రియా

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు పాల్పడి నేటికి(జూలై14) నెల పూర్తవుతోంది. ఈ సందర్భంగా అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు మరోసారి సుశాంత్‌ను తమ మదిలో గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గత నెల 14న సుశాంత్‌ ముంబైలోని తన నివాసంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి హీరోతో తనకున్న జ్ఙాపకాలను నెమరేసుకున్నారు.

ఈ మేరకు సుశాంత్‌తో దిగిన కొన్ని ఫోటోలను షేర్‌ చేయడంతోపాటు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో భావోద్వేగ లేఖ రాశారు. ‘నా భావోద్వేగాలను ఎదుర్కోడానికి ఇంకా కష్టపడుతున్నాను. నా మనసులో ఏదో అలజడి. నాకు ప్రేమ మీద నమ్మకాన్ని కలిగించావు. ప్రేమకున్న శక్తిని తెలిసేలా చేశావు. జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించావు.

దాన్నినేను ప్రతి రోజు నేర్చుకుంటానని నీకు మాట ఇస్తున్నాను. నువ్వు శాశ్వతంగా వెళ్లిపోయావనే విషయాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇప్పుడు ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నావని నాకు తెలుసు. నీలాంటి గొప్ప శాస్త్రవేత్తకు చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు స్వాగతం పలికాయని నమ్ముతున్నాను’. అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

సుశాంత్‌ మరణించి నెల రోజులవుతున్నా, జీవితాంతం తనను ప్రేమిస్తూ ఉంటానని రిచా పేర్కొన్నారు. ‘నీ మంచితనం, ఆనందంతో ప్రతి దాన్ని అద్భుతంగా మార్చగలవు. నీకోసం ఎంతో ఎదురు చూస్తుంటాను. నిన్ను మళ్లీ తిరిగి నా దగ్గరకు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. నువ్వు అందమైన, గొప్ప వ్యక్తివి. ప్రప్రంచం చూసిన వ్యక్తుల్లో నువ్వు అద్భుతం.

మన మధ్య ఉన్న ప్రేమను మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నాయి. ప్రతి దాన్ని మంచి మనసుతో ప్రేమిస్తావు. ఇప్పుడు మా ప్రేమ నిజంగా విశేషమైనదని నువ్వు నిరూపించావు. శాంతంగా ఉండు సుషీ. నిన్ను కోల్పోయి 30 రోజులు గడుస్తున్నా.. నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. నీకు శాశ్వతంగా కనెక్టు అయ్యాను’. అంటూ సుశాంత్‌పై తనకున్న అమితమైన ప్రేమను వెల్లడించారు రియా చక్రవర్తి.