6 నెలల్లో మూడు సినిమాలతో మెగాహీరో..!

Sai Dharam Tej Latest 3 upcoming

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ డిసెంబర్‌ 1న ‘జవాన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బివిఎస్‌ రవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని సీన్స్‌కు దిల్‌రాజు రీ షూట్‌ చెప్పడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు మరోసారి షూట్‌ చేసిన విషయం తెల్సిందే. ఎట్టకేలకు రీ షూట్‌ పూర్తి అయ్యింది. తాజాగా చిత్రం విడుదలకు సిద్దం అవుతున్నట్లుగా దర్శకుడు రవి ప్రకటించాడు. డిసెంబర్‌ 1న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ‘జవాన్‌’ చిత్రం తర్వాత తేజూ నటిస్తున్న చిత్రానికి వివి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల తేదీపై కూడా అప్పుడే క్లారిటీ వచ్చేసింది.

‘ఖైదీ నెం.150’ చిత్రం తర్వాత వివి వినాయక్‌ చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. సాయి ధరమ్‌ తేజ్‌ను యాక్షన్‌ హీరోగా చూపించేందుకు వివి వినాయక్‌ ప్రయత్నిస్తున్నాడు. రవితేజ ‘కృష్ణ’ చిత్రం తరహాలోనే ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఒక మంచి ప్రేమ కథతో పాటు, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందట. ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక మరో సినిమా కూడా తేజూ లైన్‌లో పెట్టాడు.

పవన్‌తో తొలిప్రేమ వంటి అద్బుత చిత్రాన్ని తెరకెక్కించి యూత్‌ ఆడియన్స్‌ను మెప్పించిన కరుణాకరన్‌ దర్శకత్వంలో ప్రస్తుతం సుప్రీం హీరో తేజూ ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ కొంత భాగం పూర్తి అయ్యింది. వినాయక్‌ సినిమాతో పాటు ఈ సినిమా కూడా రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకుంటుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వేసవి కానుకగా తేజూ, కరుణాకరన్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే కేవలం ఆరు నెలల గ్యాప్‌లోనే తేజూ మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్న మాట.