లక్ష్మీపార్వతి జీవితంలో బొమ్మాబొరుసు…

Lakshmi Parvathi Deeksha of Silence At NTR Ghat over Lakshmi's Veeragrandham

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
“ లక్ష్మీస్ ఎన్టీఆర్ “ పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రకటించగానే లక్ష్మీపార్వతి మొహం వెలిగిపోయింది. ఇన్నాళ్ళకి తన వాణి బలంగా వినిపించే వేదిక దొరికినందుకు సంతోషంతో పొంగిపోయింది. వర్మని అంతకుముందు ఎన్నోసార్లు దారి తప్పిన మేధావిగా అభివర్ణించిన లక్ష్మీపార్వతి ఈ సినిమా విషయంలో మాత్రం హాయిగా చూస్తూ ఉండిపోయారు. అటు లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిసిటీ కోసం రాము చివరికి ఎన్టీఆర్ ఆత్మ తమతో మాట్లాడారని చెబుతున్నా కూడా లక్ష్మీపార్వతి అభ్యంతరం చెప్పలేదు. ఇక వర్మ వేసే సెటైర్లకు టీడీపీ నేతలు కంగారుపడుతుంటే ఆమె మోహంలో కనిపించిన ఆనందం అంతాఇంతా కాదు. కానీ “లక్ష్మీస్ వీరగ్రంధం “ సినిమా అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ఆ ఆనందం అంతా ఆవిరి అయిపోయింది.

తన అనుమతి లేకుండా “లక్ష్మీస్ వీరగ్రంధం “ సినిమా తీయడాన్ని లక్ష్మీపార్వతి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తనని అభిమానించే నలుగురైదుగురితో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె మౌన దీక్షకి దిగారు. “ లక్ష్మీస్ వీరగ్రంధం “ సినిమా ఆపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయం మీద ఆ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి భిన్నంగా స్పందించారు. ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించక ముందు, ప్రవేశించాక జరిగిన సంగతుల మీద రెండు సినిమాలు వస్తున్నాయని ఆ రెండు ఘటనల మధ్య ఏమి జరిగిందో చెప్పడానికి తాను ప్రయత్నిస్తుంటే లక్ష్మీపార్వతికి అభ్యంతరం ఎందుకని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా తమ సినిమాలో తప్పొప్పులు ఉంటే ఆమెతో చర్చించడానికి రెడీ అని ఆయన ప్రకటించారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి ఎంత గగ్గోలు పెట్టినా ఈ సినిమా ఆపే ప్రసక్తే లేదని కేతిరెడ్డి తేల్చేసాడు.

తనని అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్, చంద్రబాబు క్యారెక్టర్స్ ని దెబ్బ తీసే సినిమాలు చేస్తుంటే ఉత్సాహంగా, ఉల్లాసంగా తల ఊపిన లక్ష్మీపార్వతికి ఎప్పుడైతే వీరగంధం ఎపిసోడ్ ముందుకు వస్తోందో తల తిరిగిపోతోంది. తన గౌరవమర్యాదలకి భంగం అని బాధపడుతున్న ఆమె తెలుగు వాళ్ళ గుండెల్లో కొలువుదీరిన ఎన్టీఆర్ గౌరవ ప్రతిష్టల గురించి ఆలోచించి “ లక్ష్మీస్ ఎన్టీఆర్ “ అని వర్మఅనౌన్స్ చేసినప్పుడే అడ్డం పడి ఉంటే బాగుండేది. కానీ తన దాకా వచ్చేదాకా ఆమెకి నొప్పి తెలియలేదు. కానీ తెలివితేటలు ఒక్కరి సొత్తు కాదు. వ్యూహానికి ప్రతివ్యూహం, నాణేనికి బొమ్మతో పాటు బొరుసు కూడా ఉంటుంది. ఈ విషయం మరిచే నాడు అత్యాశకి పోయి ఎన్టీఆర్ ని కూడా ఇబ్బందిపెట్టారు. ఇప్పుడు మీరే ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనా మూడు సినిమాలతో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఏంటి అనే దాంతో పాటు అంతకుముందు ఆ తర్వాత కూడా ఆమె ఏమిటో జనం ముందుకు రాబోతోంది.