అంతా దూరాన్ని పాటించండి.. ఉపాది హామీ కూలీలతో ఆ మంత్రి

ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా మహమ్మారితో దేశంలోని నాయకులకు, అధికారులకు చమటలు పడుతున్నాయి. దీంతో ఈ సమయంలో అంతా ప్రజల వద్దే ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమాత్రం ఏమరపాటు వహిస్తే ప్రజలలో మళ్లీ తమకు పుట్టగతులు ఉండవని భావిస్తూ వారి వారి రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకు విచిత్రంగా దగ్గరవుతున్నారు. క‌రోనా ఉంది జర జాగ్ర‌త్త‌. లాక్ డౌన్ ని పాటిద్దాం. సీఎం కెసిఆర్ చెప్పిన‌ట్లు విని అంతా బాగుపడదాం. క‌రోనా పోయేదాకా జాగ్ర‌త్తగా ఉందాం అంటూ చాటింపు వేస్తున్నారు. మంత్రి ఉపాధి హామీ కూలీల‌తో మ‌మేక‌మై మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యమేస్తుంది.

అయితే వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా.. మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో విస్త‌రించి ఉన్న త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభించారు. నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల పంపిణీ వంటి ప‌లు కార్య‌క్రమాల్లో పాల్గొన‌డానికి వెళ్తోన్న మంత్రి దారిలో మ‌హ‌బూబాబాద్ జిల్లా పెద్ద వంగ‌ర మండ‌లం కిష్టు తండాలో కాలువ శుభ్రం చేసే ప‌నులు జ‌రుగుతుండ‌గా చూశారు. వెంట‌నే అక్క‌డ మంత్రి ఆగారు. నేరుగా పొలాల గ‌ట్ల మీద నుంచి న‌డుస్తూ.. కాలువ వ‌ద్ద‌కు చేరుకుని కూలీలను పలుకరించారు. అక్క‌డ జ‌రుగుతున్న ప‌నులు ఉపాధి హామీ ప‌నుల‌ని తెలుసుకున్నారు. ఇక అంతే.. నేరుగా కూలీల‌తో మాట్లాడ‌టం మొద‌లు పెట్టారు. నేను ఎవ‌రో తెలుసా… మీ మంత్రిని నేనే… ప‌నులు మంచిగ జ‌రుగుతున్న‌యా? కూలీ ఎంత పడుతుంది? స‌రిపోతాందా? అంటూ ప్ర‌శ్నించారు.

ఆ సారు మాకు తెలుసు… మీరే మా మంత్రి. మంచిగ‌నే ఉంది సారు అని వాళ్ళు చెప్పారు. మ‌రి ఈ కాలువ ఎంత దూరం ఉంటుంది? అంత దూరం ప‌ని చేస్తున్నారా? అని అడిగారు. అవున‌ అని వారు చెప్పగానే… మంచి ప‌నే పెట్టుకున్న‌రు. ఉప‌యోగప‌డే ప‌నులే చేయండి అని ఉపాధి హామీ కూలీల‌కు మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఆ వెంట‌నే క‌రోనా ఉన్న‌ది తెలుసా? అని అడిగారు. తెలుస‌న‌గానే.. జర భ‌ద్రంగా ఉండండి. లాక్ డౌన్ పాటిస్తున్న‌రా? అని మంత్రి ఎర్ర‌బెల్లి అడిగారు. పాటిస్తున్నం స‌ర్. దూరం దూరం కూడా ఉంటున్నం అని వారు చెప్పారు. ఇంకా దూరంగా ఉండండి. క‌రోనా పోయే దాకా.. దూరం పాటించండి.. అంతా సీఎం కెసిఆర్ చెప్పిన‌ట్లు చేద్దాం. లాక్ డౌన్ ని పాటిద్దాం… అంటూ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తమదైన శైలిలో ఉపాధి హామీ కూలీల‌ను పలకలించి వారితో ముచ్చటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.