తీవ్రమైన తుపానుగా మారుతున్న ‘తౌక్టే’ అంటే అర్థమేమిటో తెలుసా. తౌక్టే అంటే బర్మీస్ భాషలో గెకో… ‘గట్టిగా అరిచే బల్లి’. ప్రస్తుతం తుపాన్‌కు మయన్మార్ దేశం పెట్టిన పేరిది. మయన్మార్ ఎందుకు పెట్టింది అంటే… ఈసారి వాళ్ల వంతు కాబట్టి. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్/ యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ప్యానెల్ తుపాన్లకు పేర్లు పెడుతుంది. ఈ ప్యానెల్‌లోని 13 దేశాలు ఏషియా– పసిఫిక్ ప్రాంతంలో వచ్చే తుపాన్లకు వంతులవారీగా పేర్లు పెడుతుంటాయి. దీంట్లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాలున్నాయి.
ఈ 13 దేశాలు తలా 13 పేర్ల చొప్పున సూచిస్తాయి. ఇలా వచ్చిన మొత్తం 169 పేర్ల నుంచి తుపాన్లకు రొటేషన్ పద్ధతిలో ఆయా దేశాల వంతు వచ్చినపుడు.. వారు సూచించిన పేర్ల నుంచి ఒకటి వాడుతారు. కిందటి ఏడాది అరేబియా సముద్రంలో వచ్చిన తుపానుకు ‘నిసర్గ’గా బంగ్లాదేశ్ నామకరణం చేసింది. వాతావరణ శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ బృందాలు, సాధారణ ప్రజానీకం ప్రతి తుపాన్‌ను ప్రత్యేకంగా గుర్తించడానికి ఈ పేరు ఉపకరిస్తుంది.