ఏకంగా వంతెన కొట్టేశారు

the bridge was stolen

దొంగలందు ఘరానా దొంగలు వేరయా అని అవీ ఇవీ ఎత్తుకు వెళితే ఏమి వస్తుంది అనుకున్నారో ఏమో ఏకంగా ఎవరికీ అనుమానమే రాకుండా 56 టన్నులు, 75 అడుగుల పొడవైన వంతెనను లేపేశారు. మామూలుగా చూడడానికే వామ్మో అనిపించేంత ఉన్న ఆ వంతెనను ఎత్తుకెళ్లిపోయారంటే వారు ఎంత తెలివిగా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.  ఐకువెన్, లొవోజిరో ప్రాంతాలను కలుపుతూ ఉంబా నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ శిథిలావస్థకి చేరడంతో అటుగా రైళ్ల రాకపోకలను నిలిపేశారు. ఈ వంతెన మధ్య భాగం నీటిలో పడిపోయిన ఫొటో ఒకటి మే 16న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మే 26న అధికారులు విడుదల చేసిన ఫొటోలో నీటిలో కూలిన వంతెన భాగం కూడా కనిపించలేదు. ఈ ఘటనపై మీడియా అధికారులను ప్రశ్నించగా ఆ శిథిలాలను తాము తొలగించలేదని తెలిపారు. దీంతో ఆ వంతెన దానంతట అదే కూలలేదని, దొంగలే దాన్ని కట్ చేసి నదిలో పడేశారని, ఆ తర్వాత ముక్కులు చేసి ఎత్తుకుపోయారని తెలిసింది. నది ప్రవాహం సాధారణంగానే ఉండటంతో అది ప్రకృతి వల్ల చోటుచేసుకోలేదని నిర్ధారించారు. ఈ ఘటనపై స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు.